is-nikki-haley-for-us-president

భారత సంతతి మహిళ నిక్కీ హేలీపై అమెరికాలో ఆసక్తికర చర్చ

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేబినెట్‌లో అత్యంత చురుకుగా పనిచేస్తున్న భారత సంతతి మహిళ నిక్కీ హేలీపై అమెరికాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టాలనే కోరిక ఆమెలో ఉందని హేలీ సన్నిహితులు, మద్ధతుదారులు చెపుతున్నారు. దీనిలో భాగంగానే ఐక్యరాజ్యసమితిని ఆమె వేదికగా మార్చుకున్నారని, 2017లో కీలకంగా వ్యవహరించారని అంటున్నారు. ఆమెకు మంచి రాజకీయ ఆలోచనలు, అవగాహన ఉన్నాయని పేర్కొంటున్నారు. అధ్యక్ష పదవి రేసులో నిక్కీ హేలీ దిగితే రిపబ్లికన్ పార్టీ తరపున మహిళల ఓట్లు పెద్ద మొత్తంలో కొల్లగొట్టే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఇదిలావుండగా ట్రంప్ కేబినెట్‌లో ఆమె కీలక సభ్యురాలుగా మారారు. ఉత్తరకొరియాపై ఐక్యరాజ్య సమితి ఆర్థిక ఆంక్షలు విధించడంలో ఆమె కీలకపాత్ర పోషించారు. ఉత్తరకొరియా విషయంలో ట్రంప్ పాత్ర కన్నా హేలీనే చాలా చురుకుగా వ్యవహరించారు. జేరూసలేం నగర విషయంలో ఐరాసలో జరిగిన ఓటింగ్‌లో అమెరికాకు వ్యతిరేకంగా ఓటు వేసిన దేశాలను గుర్తుంచుకుంటామని ఆమె తీవ్రంగా హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా నిక్కీ హేలీ పని తీరు పరంగా మంచి మార్కులు సంపాదించారని, అధ్యక్ష ఎన్నికల బరిలో దిగితే ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు.