indra-nooe-responded-over-political-entry

నాకు రాజకీయాలు సరిపడవు

వస్తే మూడో ప్రపంచ యుద్ధమే

ఇంద్రా నూయి
వాషింగ్టన్‌: రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని భారత్‌కు చెందిన పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రా నూయి స్పష్టం చేశారు. ఆసియా సొసైటీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ‘గేమ్‌ చేంజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్‌’ అందుకుంటూ నూయి ఈ విషయం చెప్పారు. పెప్సీకో నుంచి తప్పుకున్న మీకు, అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మంత్రివర్గంలో చేరే అసక్తి ఉందా? అన్న ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ విషయం స్పష్టం చేశారు. ‘నా వ్యక్తిత్వానికి రాజకీయాలు పొసగవు. నేను అన్ని విషయాలు నిర్మొహమాటంగా మాట్లాడతా. ఏ మాత్రం లౌక్యం తెలియదు. లౌక్యంగా మాట్లాడడం అంటే ఏంటో కూడా తెలియదు. నేను రాజకీయాల్లో చేరడం అంటూ జరిగితే, మూడో ప్రపంచ యుద్ధానికి నేనే కారణం కావచ్చు’ అన్నారు. దాదాపు 12 సంవత్సరాల పాటు పెప్సికో సిఇఒగా పని చేసిన నూయి ఈ నెల 2న ఆ పదవి నుంచి తప్పుకున్నారు. తన 40 ఏళ్ల ఉద్యోగంలో రోజూ తెల్లవారు జామున నాలుగింటికే లేచి రోజుకు సగటున 18 నుంచి 20 గంటల సేపు పని చేస్తూ ఉండేదాన్నని గుర్తు చేసుకున్నారు.
 
ఖాళీ సమయం కోసం విముక్తి

విపరీతమైన పని భారం ఉండే పెప్సీకో సీఈఓ పదవి నుంచి తప్పుకోవడం, ఖాళీ సమయం కోసం విముక్తి తీసుకున్నట్టుగా ఉందని నూయి చెప్పారు. సిఇఒ పదవి నుంచి తప్పుకున్నాక పనికి వెలుపల కూడా జీవితం ఉందనే విషయం గ్రహించినట్టు తెలిపారు. ఇపుడు రచనా వ్యాసాంగంతో పాటు వీలైనన్ని దేశాలు తిరిగి పని-జీవితాన్ని సమన్వయం చేసుకోవడం ఎలా? అనే విషయంపై మాట్లాడాలని ఉందన్నారు. ఇంకా టెన్నిస్‌తో పాటు రోజుకు ఆరు నుంచి పది గంటల పాటు నిద్ర పోవడం ఎలా? అనే విషయాలూ నేర్చేకోవాలనుకుంటున్నట్టు సరదాగా చెప్పారు. ఆసియా దేశాల్లో అమల్లో ఉన్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విలువలను, పశ్చిమ దేశాలు అలవర్చుకోవలసిన అవసరం ఉందన్నారు. తన అత్తమామలు, తల్లిదండ్రులు అమెరికా వచ్చి సహాయం చేయడం వలనే తన ఇద్దరు కుమార్తెలను డే కేర్‌ సెంటర్‌లో ఉంచాల్సిన అవసరం రాలేదన్నారు.