indigo-assures-to-share-holders

విమాన టికెట్ల ధరలను పెంచితే..

నగదు వినియోగంలో అప్రమత్తంగా ఉంటాం

వాటాదారులకు ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ హామీ

న్యూఢిల్లీ: దేశీయ విమానయాన రంగంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తమ వద్దనున్న నగదును తెలివిగా వినియోగించు కోనున్నట్టు ఇండిగోను నడుపుతున్న ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ తెలిపింది. విమాన టికెట్ల ధరలను పెంచితే ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తోంది. దేశీయ విమానయాన రంగంలో ఇండిగో వాటా 41 శాతం వరకు ఉంది. ఈ రంగంలోని ఇతర కంపెనీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన ఇంటర్‌గ్లోబ్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ రోహిత్‌ ఫిలిప్‌ మాట్లాడారు. విమానయాన రంగంలో నెలకొన్న పరిస్థితుల పట్ల వాటాదారుల్లో నెలకొన్న భయాలను తొలగించే ప్రయత్నం చేశారు.
 
తాము చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని, నగదు చాలా తెలివిగా వాడుతున్నామని చెప్పారు. ఇంధన ధరలు పెరగడం, టికెట్ల ధర తక్కువగా ఉండటం, అధిక పోటీ వల్ల ఏవియేషన్‌ రంగంలో కంపెనీలకు పెను సవాళ్లు ఎదురవుతున్న విషయం తెలిసిందే. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి ఇంటర్‌గ్లోబ్‌ నికర లాభం 97 శాతం తగ్గి 27.79 కోట్ల రూపాయలకు చేరుకుంది. 2015 సంవత్సరంలో ఈ కంపెనీ స్టాక్‌ మార్కెట్లో నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్థాయిలో కంపెనీ లాభం తగ్గలేదు. కాగా ప్రపంచ మార్కెట్‌తో పోల్చితే భారత మార్కెట్‌లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఇంటర్‌గ్లోబ్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ గ్రెగోరి టెయిలర్‌ తెలిపారు. 15 రోజుల ముందు బుక్‌ చేసే టికెట్ల ధరలు బాగా తగ్గిపోతున్నాయని చెప్పారు. పోటీకారణంగానే ఇలాంటి పరిస్థితి నెలకొందన్నారు.
 
ఈ ఏడాదిలోనే ఎ321 నియో విమానం
భవిష్యత్‌ వ్యాపార అవకాశాలను దృష్టిలో ఉంచుకుని 430 ఎ320 నియో విమానాలకు ఇండిగో ఆర్డరు చేసింది. వచ్చే పదేళ్ల కాలంలో ఇవి సంస్థ చేతికి వస్తాయి. ఈ ఏడాదిలోనే ఎ321 నియో విమానం ఇండిగో ప్రస్తుత విమానాల్లో చేరనుంది. ఇది అధిక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో సీట్లు కూడా అధికంగా ఉంటాయి. ప్రస్తుతం ఇండిగో వద్ద 170కి పైగా విమానాలున్నాయి. వీటిలో 40 ఎ320 నియో విమానాలున్నాయి.