Indian-worker-paralysed-after-bicycle-accident-in-Ras-Al-Khaimah-flown-home

తెలుగు వ్యక్తిని విధి వెంటాడింది..

కరీంనగర్/దుబాయ్: ఎన్నో ఆశలు, కలలు, కుటుంబ బాధ్యతలు వీటన్నింటినీ సకారం చేసుకోవాలంటే ఉపాధి కావాలి. అనుకున్నది సాధించాలని అందరికీ దూరంగా గల్ఫ్ వెళ్లిన తెలుగు వ్యక్తిని విధి వెక్కిరించింది. లక్ష్యాన్ని సాధించడానికి గమ్యస్థానమని భావించిన దుబాయ్ నగరంలో అడుగుపెట్టాడు. కలలన్నీ కల్లలయ్యాయి. జీవత్సవంలా మారాడు. అత్యంత దయనీయమైన పరిస్థితిని అనుభవిస్తున్న ఓ తెలుగు వ్యక్తికి ఎదురైన పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.          
 
తెలుగు రాష్ట్రంలోని కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్ సల్వలా అనే వ్యక్తి బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. రస్ అల్ ఖైమా పబ్లిక్ వర్క్ అండ్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌లో సర్వే లేబర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 28న విధులలో లేనిసమయంలో సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఓ రాయి తగలడంతో కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ తల బలంగా నేలను ఢీకొట్టింది. ప్రమాదంలో మెడ భాగం, చిన్న మెదడు, వెన్నుపాము తీవ్రంగా దెబ్బతిన్నాయి. మెడకు తగిలిన గాయం కారణంగా పక్షిక పక్షవాతానికి గురయ్యాడు. ఆపరేషన్‌ నిర్వహించాల్సి ఉండగా సమయానికి సరైన సౌకర్యాలు, డబ్బు లేకపోవడంతో జ్వరానికి గురైన శ్రీనివాస్‌కు పూర్తి స్థాయిలో పక్షవాతం వ్యాపించింది.
 
శ్రీనివాస్ బంధువుల సూచన మేరకు రస్ అల్ ఖైమాలోని సోషల్ వర్కర్ ప్రసాద్ శ్రీధరన్ దుబాయ్‌లోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా విపుల్‌ను సంప్రదించారు. అక్కడి భారతీయలు విరాళాలు సేకరించి శ్రీనివాస్‌ను భారత్‌కు పంపించారు. టికెట్, స్ట్రెచర్‌ను ఇచ్చి భారత్‌కు పంపించారు. శ్రీనివాస్ పరిస్థితిపై తోటి భారతీయుడు సందీప్ వెల్లలూర్ ఆవేదనను వ్యక్తం చేశాడు. శ్రీనివాస్‌కు గతేడాదే పెళ్లైందని, పెళ్లైన తర్వాత మొదటిసారిగా మూడు నెలల క్రితమే ఇక్కడికి వచ్చాడని, చాలాకాలం కలిసి పనిచేస్తున్నామని శ్రీనివాస్ పరిస్థితి ఈ విధంగా మారడం విచారకరంగా ఉందని పేర్కొన్నాడు. శ్రీనివాస్ కోలుకుని, తిరిగి పనిచేయగలిగే వరకు అతడి కుటుంబానికి సహాయం చేస్తామని చెప్పాడు. మంగళవారమే శ్రీనివాస్ తన ఇంటికి చేరుకున్నాడని తెలిపాడు.