indian-origin-scientist-succeeded-in-research

భారత సంతతి శాస్త్రవేత్త కేశవ్‌సింగ్‌ ఘనత

ముడతలు పోతాయ్‌.. కేశాలు వస్తాయ్‌

ఎలుకలపై చేసిన పరీక్షలు విజయవంతం
వాషింగ్టన్‌, జూలై 22: వయసు మీద పడే కొద్దీ శరీరాన్ని ముడతలు చుట్టుముడతాయి. వెంట్రుకలు తెల్లబడిపోతాయి.. ఊడిపోతాయి. ఈ మధ్య వయసులో ఉండగానే బట్టతల, ముఖంపై ముడతలు వచ్చేస్తున్నాయి. వాటి నుంచి కాపాడుకోవడం కోసం శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నా ఫలితం అంతంత మాత్రమే. ఈ సమస్యల నుంచి బయట పడేసేందుకు అమెరికాలోని యూనివర్సిటీ అలబామాకు చెందిన భారత సంతతి శాస్త్రవేత్త కేశవ్‌సింగ్‌ నేతృత్వంలోని బృందం సరికొత్త పరిశోధన చేసింది. ఎలుకల్లో ముడతలు పోగొట్టి, తెల్లబడిన, ఊడిపోయిన కేశాలను పూర్వ స్థితికి తీసుకొచ్చారు.
 
ముడతలు రావడానికి, జుట్టు నెరవడానికి కారణం.. మైటోకాండ్రియా సరిగా పనిచేయకపోవడమేనని గుర్తించిన పరిశోధకులు.. దాన్ని ప్రేరేపించి నెలలోనే ఎలుకలకు వచ్చిన ముడతలను పోగొట్టగలిగారు. మరికొన్ని రోజుల్లో తెల్లబడ్డ కేశాలను నల్లబడేలా, ఊడిపోయిన చోట వెంట్రుకలను పుట్టించగలిగారు. తాజా పరిశోధన మనుషులపైనా పరీక్షలు చేసేందుకు దోహదం చేస్తుందని కేశవ్‌సింగ్‌ పేర్కొన్నారు.