Indian-H1B-visa-holders-rally-outside-White-House-demanding-immigration-law-reforms

‘మేం అమెరికన్ల ఉద్యోగాలను లాక్కోవడం లేదు’.. వైట్‌హౌస్ ముందు భారత టెకీల ర్యాలీ..

వాషింగ్టన్: అమెరికాలో చట్టపరంగా నివసిస్తున్న హెచ్1-బీ వీసాదారులకు ప్రయోజనం చేకూరేలా ఇమ్మిగ్రేషన్ చట్టంలో సంస్కరణలు తీసుకురావాలని ఎన్నారైలు ఆదివారం వైట్ హౌస్ ముందు ధర్నా నిర్వహించారు. రిపబ్లిక్ హిందూ కొలిషన్(ఆర్‌హెచ్‌సీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో దాదాపు 300 మంది భారతీయులు పాల్గొన్నారు. ధర్నాలో ఎన్నారైలు ముఖ్యంగా మూడు అంశాలను లేవనెత్తారు. గ్రీన్ కార్డు పొందడానికి విదేశీయులకు శతాబ్దాలు పడుతోందని..అలా కాకుండా హెచ్1-బీ వీసాదారులు అప్లై చేసుకునే గ్రీన్ కార్డులు ఒకటి నుంచి ఐదేళ్లలోగా వచ్చేలా సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్రీన్‌కార్డుల జారీలో విధిస్తున్న కంట్రీ క్యాప్‌లో చట్టపరంగా సంస్కరణలు తీసుకురావాలన్నారు. 

ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం ప్రతి ఏడాది ఏ దేశానికి కూడా ఏడు శాతానికి మించి గ్రీన్ కార్డులను జారీ చేయడం లేదు. మరోపక్క, ప్రతి ఏడాది జారీ చేసే హెచ్1-బీ వీసాలలో 70 శాతం భారతీయులే పొందుతున్నారు. దీంతో కంట్రీ క్యాప్ వల్ల భారతీయులకు అన్యాయం జరుగుతోందని ఎన్నారైలు ఆరోపిస్తున్నారు. 2017లో అమెరికన్ కాంగ్రెస్‌లో కంట్రీ క్యాప్‌ను తీసేయాలంటూ ఓ బిల్లును పెట్టగా..ఆ బిల్లుకు అనేక దేశాలకు చెందిన సంఘాలు అభ్యర్థం చెప్పాయి. దీన్ని వల్ల కొన్ని దేశాలకు అన్యాయం జరుగుతుందని ఆయా దేశాలకు చెందిన సంఘాలు వాదించాయి. గతేడాది డెమొక్రట్ సెనేటర్ కమలా హ్యారిస్, రిపబ్లికన్ సెనేటర్ మైక్ లీ కుటుంబాలకు ఉద్యోగులకు ఇచ్చే గ్రీన్ కార్డుల విషయంలో కంట్రీ క్యాప్‌ను తీసేయాలని, కుటుంబాలకు ఇచ్చే గ్రీన్ కార్డులలో కంట్రీ క్యాప్‌ను 7 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని మరో బిల్లును ప్రవేశపెట్టారు. ధర్నాలో భారతీయులు విచిత్రమైన ప్లకార్డులను ప్రదర్శించారు. ట్రంప్ ఇటీవల బోర్డర్ వాల్ నిధుల కోసం ప్రభుత్వాన్ని షట్‌డౌన్ చేసిన విషయం తెలిసిందే. అయితే భారతీయులు గ్రీన్ కార్డుల ద్వారా ప్రభుత్వానికి 25 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని..ఈ మొత్తంతో బోర్డర్ వాల్ సులభంగా నిర్మించవచ్చని ప్లకార్డుల రూపంలో తెలిపారు. తాము అమెరికన్ల ఉద్యోగాలను లక్కోవడం లేదని ఎన్నారైలు స్పష్టం చేశారు.
 
ఇమ్మిగ్రెంట్ల పిల్లలకు కూడా గ్రీన్ కార్డు జారీ చేయాలని..లేదంటే వారికి 21 ఏళ్లు నిండిన తరువాత ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ ఎన్నారైలు వాదించారు. అక్రమంగా అమెరికాకు తీసుకొచ్చిన ఏడు లక్షల మంది ఇమ్మిగ్రెంట్ల పిల్లలకు లబ్ధి జరిగేలా ఒబామా ప్రభుత్వం డెఫెల్డ్ యాక్షన్ చిల్డ్రన్ అరైవల్(డీఏసీఏ) అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని..ప్రస్తుత ప్రభుత్వం ఆ కార్యక్రమానికి ముగింపు పలకాలని చూస్తోందని ఆరోపించారు. కాగా, ఈ అంశం ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. హెచ్1-బీ వీసాపై ఉద్యోగం చేస్తున్న వారి భార్య, పిల్లలకు అమెరికా ప్రభుత్వం హెచ్4 వీసాను ఇస్తోంది. అయితే పిల్లలకు 21 ఏళ్లు నిండిన తరువాత వారు మళ్లీ స్టూడెంట్ లేదా హెచ్1-బీ వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రకారం 21 ఏళ్లు నిండిన ఇమ్మిగ్రెంట్ల పిల్లలు అమెరికాలో నివసించడం నేరం.