indian-cheff-removed-from-restaurent

భారత సంతతి ఛెఫ్ తొలగించారు..కారణం ఏంటంటే..

దుబాయ్: యూఏఈలోని దుబాయ్‌లో ఆయనో పాపులర్ ఛెఫ్.. భారత సంతతికి చెందిన ఆయన అక్కడ చాలా ఫేమస్. ఆయన అనుకోవాలే కానీ, తమ హోటల్లో చేరమంటూ  ఆఫర్లు క్యూ కడతాయి. అలాంటిది ఒక చిన్న ట్వీట్ ఆయనను పదవీచిత్యున్ని చేసింది. యూఏఈలో జరిగిన ఈ ఘటన ఇండియాలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. కారణం ఆయన ట్వీట్‌లో హిందూ, ముస్లీం అనే పదాలను వాడటమే.
 
ఇంతకీ విషయం ఏమిటంటే.. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా క్వాంటికో అనే టీవీ సిరీస్‌తో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి ఎపిసోడ్ హిట్ కావడంతో రెండో సిరీస్‌లోనూ ప్రియాంక నటించింది. కాగా మొదటి ఎపిసోడ్‌కు ఇండియా నుంచి కూడా మంచి స్పందనే వచ్చింది. అయితే రెండో ఎపిసోడ్‌లో హిందువులను టెర్రరిస్ట్‌లుగా చూపించడం పట్ల దేశంలోని కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ప్రియాంక కూడా ‘తాను భారతీయురాలిగా గర్వపడతాను’ అని వివరణ ఇచ్చుకున్నారు.
 

కాగా తాజాగా ఇదే విషయమై అసంతృప్తి వ్యక్తం చేసిన అతుల్ కొచ్చార్ అనే మాస్టర్ చెఫ్‌ ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. ‘‘2000 ఏళ్ళ నుంచి ఇస్లాం వారిచే భయబ్రాంతులకు గురవుతున్న హిందువుల మనోభావాలను గౌరవించకపోవడం బాధాకరం. మీ పట్ల చింతిస్తున్నాను’’ అని ప్రియాంక పోస్ట్‌కు రిప్లై ఇచ్చారు. ఈ ట్వీటే ఆయనను చిక్కుల్లో పడేసింది. యాంటీ ఇస్లాం ట్వీట్‌గా భావించిన జేడబ్ల్యూ మారియోట్ మర్కూస్ హోటల్ ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ విషయమై ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. కాగా ప్రియాంక దీనిపై ఎలా స్పందిస్తారోనని వేచి చూడాల్సి ఉంది.