Immigration-officer-helps-the-man-stuck-at-UAE-airport

విమానాశ్రయంలో చిక్కుల్లో భారతీయుడు.. సాయం చేసిన అధికారి

దుబాయి: కష్టాల్లో కూరుకుపోయి దిక్కుతోచని పరిస్థితి.. ఏం చేయాలో తెలియదు. తెలిసిన వారు కూడా సాయం చేయలేని స్థితి.. ఇలాంటి సమయాల్లో మనిషి రూపంలో వచ్చి కష్టాల్ని తొలగించమని దేవుడిని ప్రార్థిస్తుంటారు చాలామంది. అదృష్టం బాగుంటే ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి కూడా. అలాంటి పరిస్థితినే ఓ భారతీయుడు దేశం కాని దేశంలో ఎదుర్కొన్నాడు. ముక్కు మొఖం తెలియని ఓ వ్యక్తి దేవుడిలా వచ్చి సాయం చేస్తే కుటుంబంతో సహా సొంతగడ్డకు చేరుకున్నాడు. ఫహద్ అనే భారతీయుడు దుబాయిలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ భార్య ఒక పాపతోసహా అక్కడే ఉంటున్నాడు. అయితే తన భార్య అమ్మమ్మకు ఆరోగ్యం బాగాలేదని అతడికి ఫోన్ వచ్చింది. వెంటనే భార్య పిల్లలతో సహా తన సొంత ప్రాంతమయిన కేరళకు బయలుదేరాడు. యూఏఈలోని రస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ముగ్గురికీ టికెట్లు తీసుకుని ఇమ్మిగ్రేషన్ డెస్క్ వద్దకు చెకింగ్‌కు వెళ్లాడు. అప్పుడే ఊహించని సమస్య వారికి ఎదురైంది. 

 
పాప వీసాకు 2018 జూలై నెల వరకూ గడువు ఉందని కార్డుపై ముద్రించి ఉన్నా.. కంప్యూటర్‌లో మాత్రం ఫిబ్రవరిలోనే ముగిసిందని చూపిస్తోంది. అప్పటి నుంచి పాప అక్రమంగా దేశంలో ఉంటున్నట్లు కంప్యూటర్ లెక్కలు తేల్చిచెబుతున్నాయి. దీంతో ఆందోళన చెందిన ఫహద్.. ఉన్నతాధికారులను కలిశాడు. సిస్టమ్‌లో అప్‌డేట్ చేయడంలో పొరపాటు జరగడం వల్లనే ఇలా జరిగిందని వారు గుర్తించారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయడానికి ఒకరోజు సమయం పడుతుందని అధికారులు తెలిపారు. అయితే కొద్ది గంటల్లో భారత్‌కు వెళ్లబోయే విమానానికి వాళ్లు ఎప్పుడో టికెట్లు తీసుకున్నారు. ఒకరోజు ఆగాలంటే మళ్లీ కొత్తగా టికెట్లు తీసుకోవాలి. ఇక్కడే ఫహద్‌కు అసలు సమస్య ఎదురైంది. తన వద్ద మళ్లీ టికెట్లు తీసుకోవడానికి డబ్బు లేకపోగా... కనీసం రాత్రి పూట ఏదైనా హోటల్‌లో  ఉండటానికి కూడా సరిపడా డబ్బు లేదు.
 
అప్పటికే ఈ సమస్య గురించి తెలుసుకున్న భార్య పాప కన్నీరు మున్నీరవుతున్నారు. వారితోపాటు తాను కూడా దు:ఖంలో ఉంటే కుదరదని భావించి తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. ఎవరైనా అధికారులు సాయం చేస్తారేమో చూడమన్నాడు. అయితే అదే విమానాశ్రయంలో ఉండే ఓ అధికారి చాలా మంచివాడనీ, సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు మార్గం చూపుతాడని స్నేహితుడు చెప్పడంతో వెంటనే ఆ అధికారి వద్దకు వెళ్లాడు ఫహద్. మమ్మద్ అహ్మద్ మటర్ అనే ఇమ్మిగ్రేషన్ అధికారి వద్దకు వెళ్లిన ఫహద్.. తన సమస్యను తెలియజేశాడు. అప్పటికే డ్యూటీ టైమ్ అయిపోయి బ్యాగు పట్టుకుని వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఆయన.. ఫహద్ సమస్యను విని ఆగిపోయాడు. తన సిస్టమ్‌ను మళ్లీ ఓపెన్ చేసి చూసి.. రూల్స్ ప్రకారం ఒకరోజు సమయం తప్పదని తెలియజేశాడు. అయితే మళ్లీ టికెట్లు కొనడానికి తన వద్ద డబ్బు లేదనీ, ఏదో విధంగా ఈ విమానానికే వెళ్లేలా సాయం చేయాలని కోరగా.. తన పర్సు నుంచి కొంత డబ్బును ఇచ్చాడా ఆఫీసర్. వీటితో కుటుంబమంతా ఈ రాత్రికి భోజనం చేసి విమానాశ్రయ విశ్రాంతి గదిలో ఉండమని చెప్పి, టికెట్ల సంగతి తాను చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. మొదట ఆ డబ్బును తీసుకోవడానికి ఫహద్ మొహమాట పడినా.. అధికారి ఒత్తడి చేయడం, వేరే మార్గం కూడా లేకపోవడంతో చివరకు అంగీకరించాడు. మరుసటి రోజు టికెట్లను వాళ్లకు ఇచ్చి.. దగ్గర ఉండి మరీ వాళ్లను విమానం ఎక్కించాడా అధికారి. ఈ యేడాది ఆగస్టు 14న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన అనుభవాలను ఫహద్ మీడియాతో పంచుకున్నాడు. భార్య అమ్మమ్మకు ఆరోగ్యం బాగాలేక.. వెంటనే ఈ విషయాలను బయటకు వెల్లడించలేకపోయానని తెలిపాడు. మమ్మద్ అహ్మద్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపాడు. తాను ఎలాగైనా ఆయన రుణాన్ని తీర్చుకుంటానని అంటున్నాడు ఫహద్. ముక్కు మొఖం తెలియకపోయినా కష్టాల్లో ఉన్న వ్యక్తికి సాయం చేసిన ఆ అధికారిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.