I-will-give-money-back-to-Trump-says-porn-star

ట్రంప్‌ సొమ్ము వెనక్కిచ్చేస్తా

నాడేం జరిగిందో చెప్పేస్తా...

శృంగార తార స్టార్మీ డేనియల్స్‌ ప్రకటన

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాసలీల బాగోతం మరో కీలకమలుపు తిరిగింది. 2006లో ట్రంప్‌తో సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శృంగార తార స్టెఫానీ క్లిఫోర్డ్‌ అలియాస్‌ స్టార్మీ డేనియల్స్‌ మంగళవారం ఓ బాంబు పేల్చింది ట్రంప్‌తో బంధాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు తనకు చెల్లించిన రూ 87 లక్షల మొత్తం (1,30,000 డాలర్లు) తిరిగి ఆయనకే ఇచ్చేస్తానని ప్రకటించింది.
 
ఆ లైంగిక సంబంధం వివరాలను ఎన్నటికీ బయటపెట్టకుండా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకుని ఈ మొత్తాన్ని ట్రంప్‌ తరఫున ఆయన న్యాయవాది కోహెన్‌ 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో చెల్లించారు. అయితే మీడియా కథనాలతో ఇది రచ్చ రచ్చ అయిపోయింది. దీంతో స్టార్మీ ఆ డబ్బు వెనక్కి ఇచ్చేసి- పన్నెండేళ్ల కిందట ఏం జరిగిందో బయటపెట్టాలని నిర్ణయించుకుంది. దీని వల్ల ట్రంప్‌ మరింతగా ఇరుక్కోనున్నారు.
 
ఇప్పటికే అనేకమంది మహిళలతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్‌కు- ఈ కేసు వల్ల రాజకీయంగా కూడా చిక్కులు తప్పకపోవచ్చని అంటున్నారు. స్టార్మీ డేనియల్స్‌ తో తనకు అసలు సంబంధమే లేదని, అసలామె ఎవరో తెలీదని ట్రంప్‌ మొదట్లో బుకాయించారు. స్టార్మీ నోరు మెదపకుండా ఉండేందుకే ఆ డబ్బు చెల్లించారని, అది కూడా కోహెన్‌ తాలూకు న్యాయ సలహా సంస్థ నుంచి చెల్లింపు జరిగిందని అంటూ మీడియాలో నాటి ఒప్పందం ప్రతులు వచ్చేసరికి నిర్ఘాంతపోవడం ట్రంప్‌ వంతయింది. ఈ ‘హష్‌’ సొమ్ము కారణంగా స్టార్మీ చట్టపరంగా నోరు మెదపలేని స్థితి ఏర్పడింది. దీనిపై మీడియా కథనాలు ఆగకపోవడంతో ఆమె మైఖేల్‌ అవెనాటి అనే లాయర్‌ను సంప్రదించింది. ఆ సొమ్ము వెనక్కి ఇచ్చేస్తే 2006లో ట్రంప్‌ నెరిపిన బాగోతం మొత్తాన్ని బయటపెట్టవచ్చని అంతా భావించడంతో ‘‘ఈ డబ్బు ఇచ్చేసి అప్పట్లో ట్రంప్‌ పంపిన సందేశాలు, దిగిన ఫొటోలు, టెక్ట్స్‌ మెసేజ్‌లు, ఇచ్చిన హామీలు.. అన్నీ బయటపెడతానని, తద్వారా అమెరికన్‌ ప్రజలకు నిజానిజాలేంటో, ఎవరు తప్పు చేశారో, నిజంగా తనకూ, ట్రంప్‌కూ మధ్య అఫైర్‌ ఉందో లేదో తెలుస్తుందని’’ స్టార్మీ డేనియల్స్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ శుక్రవారం లోగా ట్రంప్‌ తరఫు న్యాయవాది చెప్పిన అకౌంట్లోకి డబ్బు బదలాయిస్తామని లాయర్‌ అవెనాటి తెలిపారు. అయితే దీనిపై అటు కొహెన్‌గానీ, వైట్‌ హౌస్‌గానీ ఇంతవరకూ స్పందించలేదు. మూడో భార్యను పెళ్లి చేసుకున్న ఏడాది తర్వాత ఓ రిసార్ట్‌లో ట్రంప్‌. స్టార్మీ డేనియల్స్‌ వెంటపడినట్లు ఆరోపణ. ఆరునెలల పాటు ఆ రాసలీలలు సాగాయి.
 
2016లో ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి అయినపుడు అప్పటి ఆ బంధం బయటపడకుండా ఉండేందుకు ఆమెకు భారీగా చెల్లించారు. అయితే ఒప్పంద పత్రంపై ట్రంప్‌ సంతకం చేయలేదు. న్యాయవాది కోహెన్‌ సంతకం చేశారు. అందులో ట్రంప్‌ పేరును నేరుగా ప్రస్తావించకుండా డేవిడ్‌ డెనిసన్‌ అనీ, స్టార్మీ పేరును పెగ్గీ పీటర్సన్‌ అనీ పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని స్టార్మీ అంటే పెగ్గీ ఉల్లంఘిస్తే కోర్టు ఆమెకు 10 లక్షల డాలర్ల దాకా జరిమానా విధించవచ్చు. ‘ఒప్పందాన్ని ఉల్లంఘించి ఏం జరిగిందో చెప్పు.. ఆ జరిమానా మేం కడతాం’ అంటూ ఇప్పటిదాకా తనకు 10మంది ప్రపోజ్‌ చేశారని స్టార్మీ తెలిపింది. అయితే వారి పేర్లు బయటపెట్టలేదు.