:: Welcome to NRI - Article ::

జిమ్‌లో మకాం వేసిన భారీ కొండచిలువ!

 ఆస్ట్రేలియా: రాక్‌హాంప్టన్ నగరంలోని బోక్వా సీక్యూ జిమ్... మంగళవారం ఎప్పటిమాదిరిగానే శిక్షణ ఇచ్చేందుకు యజమాని చాంతల్ వాఘాన్ వ్యాయామశాలలో అడుగుపెట్టారు. సీలింగ్‌కు పెద్ద కన్నం పడి ఉండడం చూసి ఏదో జంతువు పని అయిఉంటుందని లైట్ తీసుకుందామె. రెండు రోజు తర్వాత గానీ పనిమనిషి నుంచి షాకింగ్ న్యూస్ తెలిసింది. జిమ్‌లో భారీ కొండచిలువను చూశాననీ, సీలింగ్‌కు పడిన కన్నం కూడా దాని పనేనని  వర్తమానం వచ్చింది. వెంటనే స్నేక్ క్యాచర్స్‌కి ఫోన్ చేసిన ఆమె సీలింగ్‌కి పడిన కన్నం, కొండచిలువను ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టారు. ‘‘మంగళ, బుధవారాల్లో ఈ పాము ఎక్కడ నక్కిందో నాకు తెలియదు. నాపాటికి నేను ఈ రెండ్రోజులు మామూలుగానే క్లాసులు చెప్పాను. కనీసం అది ఎక్కడుందో అలికిడి కూడా వినిపించలేదు’’ అని వాఘాన్ పేర్కొన్నారు. అప్పటికే భారీ జంతువును తిని ఉందో ఏమోగానీ... దాని పొట్ట చాలా భారంగా ఉందనీ... కదల్లేక బద్ధకంగా ఉండడంతో స్నేక్ క్యాచర్స్‌కి కూడా దాన్ని పట్టుకోవడం కష్టం కాలేదని పేర్కొన్నారు. కొండచిలువను పట్టుకెళ్లాకగానీ తమ అనుమానాలన్నీ తీరిపోయాయనీ.. ఇప్పుడు నిర్భయంగా పనిచేసుకుంటున్నామని నిట్టూర్చారు.

 
 
 
 
 
 
 
 

 

Loading...