gun-fire-kills-13-in-usa

అగ్రరాజ్యంలో కాల్పులు.. 13 మంది మృతి

కాలిఫోర్నియా, యూఎస్ఏ: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. దక్షిణ కాలిఫోర్నియాలో సాయుధుడైన ఓ దుండగుడి కాల్పులకు 12 మంది సామాన్య ప్రజలతోపాటు ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. లాస్‌ఏంజెలెస్‌కు 40 మైళ్ల దూరంలోని థౌజండ్ ఓక్స్‌లో ‘బోర్డర్‌లైన్ బార్ అండ్ గ్రిల్ బార్‌’లో దారుణమైన ఈ ఘటన జరిగింది. బుధవారం రాత్రి 11:30 సమయంలో ఈ కాల్పులు జరిగాయి. కాల్పులకు పాల్పడ్డ దుండగుడు కూడా చనిపోయాడని వెంచూరా కౌంటీ పోలీసు అధికారి ఎరిక్ బుచో తెలిపారు. ఘటనా స్థలం అత్యంత భయానకంగా ఉందని, ప్రాంతమంతా  రక్తమయమైందని తెలిపారు. ఘటన జరిగినప్పుడు అక్కడున్నవారిని విచారించి వివరాలు రాబడుతున్నామని, దుండగుడు మొత్తం 30 రౌండ్ల కాల్పులు జరిపాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారని ఆయన వెల్లడించారు. కాల్పుల అనంతరం దుండగుడు పొగ బాంబులు కూడా విసిరాడన్నారు. ప్రజలు ఘటన స్థలానికి సమీపంలో సంచరించవద్దని పోలీసులు సూచించారు.  కాల్పులు జరిగిన సమయంలో బార్‌లో వందలాది మంది ఉన్నారని బార్ యాజమాన్యం వెల్లడించింది.