Green-Field-Airport-in-Andhrapardesh-

రేపు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం భూమిపూజ

నిర్మాణం పనులకు త్వరలోనే టెండర్లు.. వైద్య కళాశాలకూ సీఎం శంకుస్థాపన
విజయనగరం(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి ఈనెల 13న సీఎం చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు. దీని నిర్మాణంపై కొన్ని నెలలుగా స్తబ్దత నెలకొంది. పనులకు సంబంధించి గతంలో పిలిచిన టెండర్లు రద్దు కావడంతో మళ్లీ టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విమానాశ్రయం పనులు పూర్తయితే ఈ ప్రాంతానికి అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల రాకపోకలతో పాటు, కార్గో సేవలు, ముఖ్యంగా కూరగాయల ఎగుమతి, దిగుమతులకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
 
మరోవైపు విమాన విడిభాగాల తయారీ కేంద్రాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. విమానాశ్రయంతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మొత్తంగా 2,725 ఎకరాలు అవసరమని ప్రతిపాదించారు. ఇందులో ప్రభుత్వ భూమి 420ఎకరాలు, అసైన్డ్‌ భూములు(డి పట్టా) 810 ఎకరాలను ఎయిర్‌పోర్టు అథారిటీకి అప్పగించారు. రైతుల నుంచి 1,400 ఎకరాల జిరాయితీ భూసేకరణకు నిర్ణయించిన ప్రభుత్వం సుమారు 150ఎకరాలు మినహా మిగిలిన భూములను సేకరించింది. విమానాశ్రయ పరిధిలో నాలుగు గ్రామాలు నిర్వాసిత గ్రామాలున్నాయి.

 

ప్రాథమికంగా గుర్తించిన వివరాల ప్రకారం మరడపాలేంలో 223, రెడ్డిపేటలో 65, బొల్లంకెలపాలేంలో 55, ముడసర్లపేటలో 33 కుటుంబాలను గుర్తించారు. అయితే మైనారిటీ తీరిన, వివాహమైనవారిని కూడా కుటుంబాలుగా గుర్తించాలన్న డిమాండ్‌ కారణంగా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వీరికి ఇళ్లు నిర్మించేందుకు గూడెపువలస గ్రామ రెవెన్యూ పరిధిలో 18ఎకరాలు, పోలిపల్లి రెవెన్యూ పరిధిలో 27 ఎకరాల భూ సేకరణ పూర్తయింది.