Good-News-From-Trump..-Cannot-Expected-

ప్రవాసీలకు ఊహకందని శుభవార్త..!

హెచ్‌1బీతో అమెరికా పౌరసత్వం!
త్వరలో నిబంధనల సరళీకరణ.. నైపుణ్యం ఉన్నవారికి చాన్స్‌
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన.. ప్రవాసీలకు ఊరట
హెచ్‌1బీ వీసాదారుల్లో అనిశ్చితికి తెరపడే అవకాశం
హెచ్‌1బీ... దక్కడమే గగనం. అలాంటి వీసాకు స్థిరత్వం వస్తే.. ఏకంగా అమెరికాలో పౌరసత్వానికి వీలు కల్పిస్తే..! ఆ మాట వలస విధానంపై నిత్యం రుసరుసలాడే డోనాల్ట్‌ ట్రంప్‌ నోటి నుంచి వస్తే..? ఊహకు కూడా అందనిది... ఇప్పుడిది వాస్తవరూపం దాల్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. వేల మంది టెకీల్లో కొత్త ఆశలు చిగురించే ప్రకటన ఇది.. శాశ్వత పౌరసత్వం కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్న లక్షల మందికి తీయ తేనియలొలికే సంక్రాంతి కానుక..!
 
‘‘హెచ్‌1 బీ వీసా వ్యవస్థలో మార్పులు తీసుకురాబోతున్నాం. నిబంధనలు సరళీకరిస్తున్నాం. మీరు అమెరికాలోనే ఉండేవిధంగా అవకాశాలు కల్పించబోతున్నాం. దేశ పౌరసత్వం పొందేందుకు కూడా మార్గం ఏర్పరచబోతున్నాం. మంచి ప్రతిభ, విశేష నైపుణ్యం ఉన్నవారు అమెరికాలో తమ విద్య, ఉద్యోగావకాశాలు కొనసాగించుకోవాలన్నది మా అభిలాష’’
-ట్రంప్‌ ట్వీట్‌
 
వాషింగ్టన్‌, జనవరి 11: భారతీయ టెకీలకు శుభవార్త. ఇన్నాళ్లూ నిబంధనల చట్రంలో ఇరుక్కున్న హెచ్‌-1బీ వీసాలు ఇకమీదట సరళతరం కానున్నాయి. అంతేకాదు.. హెచ్‌-1బీ వీసాలతో అమెరికా పౌరసత్వం పొందడానికి కూడా వీలు కల్పించనున్నారు. వలస విధానంపై ఉక్కుపాదం మోపిన అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా ఈ విషయం ప్రకటించడం విశేషం. హెచ్‌1 బీ అనేది నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసా. అమెరికన్‌ కంపెనీలు విదేశీ నిపుణుల్ని పనిలో పెట్టుకోవడానికి ఉపకరించే మార్గం. దీనికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా భారతీయ టెకీలు- మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ఐటీ నిపుణులు దీని కోసం అర్రులు చాస్తుంటారు. 2018లో ఈ వీసా కోసం దరఖాస్తు చేసిన వారి సంఖ్య తొలి రెండు వారాల్లోనే 65 వేల పరిమితిని దాటిందంటే దీనికున్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. హెచ్‌1బీ ద్వారా పౌరసత్వం పొందే అవకాశాలు ఇన్నేళ్లూ లేవు. ఇపుడు తొలిసారిగా ట్రంప్‌ ప్రతిపాదిస్తుండడం విశేషం.
 
ఈ నిర్ణయం ఓ రకంగా వీసా విషయంలో ఓ భరోసా. అక్కడున్న వారికి, మన దేశం నుంచి వెళ్లే వారికీ తమ విద్యా ఉద్యోగ అవకాశాలు ప్లాన్‌ చేసుకోడానికి ఓ అవకాశం కల్పిస్తుంది. ట్రంప్‌ తన ట్వీట్‌లో వివరాల్లోకి వెళ్లలేదు గానీ దాన్ని నిశితంగా పరిశీలిస్తే- నైపుణ్యం ఉన్న వారికి అంటే అమెరికా ఆర్థిక ప్రగతి దోహదపడేవారికీ- పౌరసత్వం కల్పించడానికి ఆయన సుముఖంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారం నాటి నుంచి ట్రంప్‌- వలస విధానంలో మార్పుల్ని ప్రధాన అజెండాగా చేసుకున్నారు. పదవి చేపట్టాక- అమెరికా ఫస్ట్‌ నినాదంతో భారతీయ టెకీల గుండెల్లో గుబులు రేపారు. హెచ్‌-4 వీసా ఎత్తేశారు. అమెరికాలో మాస్టర్స్‌ చేసినవారికే తొలి ప్రాధాన్యం అంటూ హెచ్‌1బీ వీసా దరఖాస్తుల వడపోతకు ఓ దిశను ఏర్పరిచారు.
 
వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ అనేక నియమాలు తెచ్చారు. ఫలితంగా అనేక అగ్రశ్రేణి టెక్నాలజీ కంపెనీలు కూడా భారతీయులకు బదులు అమెరికన్లనే ఉద్యోగులను పెట్టుకోవడం మొదలుపెట్టాయి. అత్యంత నైపుణ్యం ఉన్న వారికే ప్రాధాన్యం అన్న మాట కొత్తదేం కాదుగానీ, ఈ మాటతో ఆయన నైపుణ్యం ఉన్న వారి సంఖ్య సైతం తగ్గించే ప్రయత్నం చేయవచ్చని ఇన్నాళ్లూ విమర్శకులు భావించారు. తాజా ట్వీట్ల ప్రకారం- ఆయన నైపుణ్యం ఉన్న వారి హెచ్‌1బీ పట్ల సానుకూలత వ్యక్తం చేసినట్లు వారు అంగీకరిస్తున్నారు. వలస విధానంలో మార్పులపై ప్రస్తుతం కాంగ్రె్‌సలో రెండు బిల్లులు పరిశీలనలో ఉన్నాయి. అమెరికా ఫెడరల్‌ కోర్టులో రెండు కీలక కేసులు కూడా ఉన్నాయి.