good-news-for-all-

భూమి కోసం తపించే ప్రతి ఒక్కరికీ.. ఈ శుభవార్త!

న్యూయార్క్: పర్యావరణ ప్రియులకు శుభవార్త. దశాబ్దాలుగా భూమికి ప్రమాదకరంగా ఉన్న ఓజోన్ పొర చిల్లును బాగు పరిచే ప్రయత్నాల్లో శాస్త్రవేత్తలు విజయవంతం అయ్యారు. 2030 నాటికి పూర్తిస్థాయిలో చిల్లును పూడ్చిపెడతామని.. పూర్వ స్థితికి చేరుకుంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి ఓ ప్రకటనలో తెలిపింది. అంటర్కిటికా ఖండంపై ఏర్పడ్డ ఈ చిల్లును 1980లలో గుర్తించారు. ఏటా సెప్టెంబర్ నెలలో విస్తరిస్తూ భయాందోళనకు గురి చేస్తూ వస్తోంది. 1991లో ఓజోన్‌పై పరిశోధనలు ప్రారంభించిన శాస్త్రవేత్తలు.. చిల్లు విస్తరణ 76 లక్షల చదరపు కిలోమీటర్లని తేల్చారు. ఇది అమెరికా వైశాల్యం కన్నా రెండున్నర రెట్లు. అయితే అంతర్జాతీయంగా జరిగిన మాంట్రియోల్ ఒప్పందం ప్రకారం తీసుకున్న చర్యల కారణంగా.. చిల్లు విస్తరణ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తోంది. 1988 నుంచి ఇప్పటి వరకు పోల్చితే ఓజోన్ చిల్లు విస్తరణ దాదాపు తగ్గుముఖం పట్టినట్టుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల అంటర్కిటికాలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. మంచు కరగదని అంటున్నారు.

ఓజోన్‌ పొర ప్రత్యేకత ఏంటో అందరికీ తెలిసిందే. దానికి ఏమైనా జరిగితే.. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు భూమిని నేరుగా తాకుతాయి. దీనివల్ల స్కిన్ క్యాన్సర్‌తో పాటు చర్మవ్యాధులు వస్తాయి. దీంతో ఓజోన్ పొరపై అవగాహన కల్పించేవిధంగా యూఎన్ఓ ఏటా సెప్టెంబర్ 16ని ‘ఓజోన్ డే’ గా నిర్వహిస్తోంది.