gold-smuggler-arrested-in-airport

పేస్టులో బంగారం కలిపి రవాణా

శంషాబాద్‌ విమానాశ్రయంలో చిక్కిన స్మగ్లరు

శంషాబాద్‌: బంగారం రవాణాకు స్మగ్లర్లు కొత్త దారులు వెతుకుతున్నారు. మనుషుల శరీర భాగాలతో పాటు ఎలక్ర్టానిక్‌ పరికరాలు, చెప్పులు, షూలు, దుస్తులు, బొమ్మలు, స్ర్తీలు వాడే కాస్ట్యూమ్స్‌లలో బంగారం రవాణాకు యత్నించి పట్టుబడిన సంఘటనలు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంతవరకు వెలుగులోకి వచ్చాయి. ఈసారి స్మగ్లర్లు కొత్త పంథా ఎంచుకున్నారు. పేస్టు రూపంలో ఉన్న కెమికల్‌ మిశ్రమంలో బంగారాన్ని పొడిగా చేసి తరలించేందుకు విఫలయత్నం చేశారు. దాన్ని రవాణా చేసేందుకు యత్నించి డీఆర్‌ఐ అధికారులకు చిక్కారు. ఎయిర్‌పోర్టులో ఆదివారం ఈ సంఘటన జరిగింది.
 
డీఆర్‌ఐ వర్గాల కథనం ప్రకారం.. కొలంబో కేంద్రంగా కొందరు స్మగ్లర్లు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు బంగారం తరలిస్తున్నారని సమాచారం అందింది. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి మదురై మీదుగా శంషాబాద్‌కు వచ్చిన విమానంలోంచి దిగి ఎయిర్‌పోర్టు వెలుపలికి వస్తున్న ప్రయాణికులపై నిఘా పెట్టారు. ఓ ప్రయాణికుడిపై అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకొని సోదా చేశారు. అతని వద్ద పేస్టు రూపంలో ఉన్న బంగారాన్ని కనుగొన్నారు. మొత్తం పేస్టును కరిగించారు. పేస్టు బరువు 1,800 గ్రాములు. కరిగించాక 1,120 గ్రాములయింది. నిందితుడిని అరెస్టు చేశారు. దొరికిన బంగారాన్ని సీజ్‌ చేశామని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.