girl-badly-injured

అమ్మాయిని నదిలోకి తోసేసి..

వాషింగ్టన్: స్నేహితులతో కలిసి విహరయాత్రకు వెళ్లిన జోర్డాన్(16) అనే అమ్మాయికి చేదు అనుభవం ఎదురైంది. దాదాపు ఆ అమ్మాయి చచ్చి బతికింది. జోర్డాన్ తన స్నేహితులతో కలిసి నదిలో ఈతకొట్టేందుకు వెళ్లింది. 60 అడుగుల ఎత్తున్న బ్రిడ్జ్‌పై నుంచి జోర్డాన్ స్నేహితులు నదిలోకి దూకుతున్నారు. జోర్డాన్‌ను కూడా నదిలో దూకాలని వారు కోరారు. అయితే తనకు ఎత్తైన ప్రదేశాల నుంచి దూకాలంటే భయమని జోర్డాన్ వారికి తెలిపింది. అయినా సరే ఆమె స్నేహితులు అవేమి పట్టించుకోలేదు. ఆమెను నదిలో దూకాల్సిందేనని పట్టుబట్టారు. ఎంత ప్రయత్నించినా జోర్డాన్ నదిలో దూకకపోవడంతో ఓ అమ్మాయి  ఆమెను కిందకు తోసేసింది. ఆకస్మాత్తుగా ఈ ఘటన జరగడంతో జోర్డాన్‌కు ఏమి అర్థం కాలేదు.

తాను దాదాపు చనిపోయానని భావించానని ఆమె తెలిపింది. తోసేసిన కొద్దిసేపటికే తాను నీళ్లను తాకానని ఆమె చెబుతోంది. అయితే వెంటనే దగ్గరలో ఈత కొడుతున్న వ్యక్తులు తనను గుర్తించి ఒడ్డుకు తీసుకురావడంతో బతికిపోయాయని జోర్డాన్ తెలిపింది. ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. జోర్డాన్ అయిదు పక్కటెముకలు విరిగిపోయాయి. కాళ్లకు, చేతులకు కూడా గాయాలు అయ్యాయని ఆమె తల్లి తెలిపింది. జోర్డాన్‌ను నదిలోకి తోసేసిన సమయంలో కొంతమంది వీడియో తీశారు. ఆ వీడియో ఆధారంగా పోలీసులు జోర్డాన్‌ను తోసేసిన అమ్మాయిని గుర్తించి అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.