:: Welcome to NRI - Article ::

భారత్‌-యుఎస్ భాగస్వామ్యానికి జిఈస్‌ ప్రతీక

వాషింగ్టన్‌: డిజిటల్‌ ఎకానమీ, ఆంత్రప్రెన్యూరియల్‌ నైపుణ్యాలను మరింతగా పెంచేందుకు భారత్‌, అమెరికా ఎలా కలిపి పని చేస్తున్నాయో తెలియజేసేందుకు గ్లోబల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ (జిఈస్‌) దోహదపడనున్నట్టు అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్‌ రోస్‌ తెలిపారు. నవంబర్‌ 28 నుంచి 30వ తేదీ వరకు హైదరాబాద్‌లో జిఈస్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ఆంత్రప్రెన్యూర్లు ముఖ్యంగా మహిళలు పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్‌ సారథ్యంలోని అమెరికా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

ఈ నేపథ్యంలో యుఎస్-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ గ్లోబల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న సందర్భంగా రోస్‌ మాట్లాడుతూ.. రెండు దేశాల పౌరుల్లో ఆంత్రప్రెన్యూరియల్‌ నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు, ఆర్థిక వ్యవస్థను మరింత డిజిటలైజ్‌ చేసేందుకు చేస్తున్న కృషికి జిఈస్‌ మరో నిదర్శనంగా మారుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్నోవేటర్లు, ఆంత్రప్రెన్యూర్లు, ఇన్వెస్టర్లు జిఈస్ లో పాల్గొంటారని చెప్పారు. జిఈస్‌ జరిగే హైదరాబాద్‌లో అద్భుతమైన స్టార్టప్‌ ఏకో సిస్టమ్‌ ఉందని, ఇందులో టి-హబ్‌ ముఖ్యమైనదని అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు మహిళా వ్యాపారవేత్తలు చాలా కీలకమని, దీన్ని దృష్టిలో ఉంచుకునే మహిళలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు.