The-weird-history-of-88-years-old-passport

బ్రిటీష్ పరిపాలనలో ప్రపంచాన్ని చుట్టేసిన భారతీయుడు..ఈయన కథ వింటే ఔరా అనాల్సిందే..

బెంగళూరు: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 వసంతాలు దాటినా..ఇప్పటికీ కొన్ని కోట్ల మంది భారతీయులకు పాస్‌పోర్టు లేదన్నది ఆసక్తికర విషయం కాకపోవచ్చు. కానీ, బ్రిటీష్ ప్రభుత్వంలో బ్రిటీష్ పాస్‌పోర్టుతో మధ్యతరగతికి చెందిన ఓ భారతీయుడు సరదా కోసం ప్రపంచం మొత్తం చుట్టేశాడంటే అది నిజంగా ఆసక్తికర విషయమే అవుతుంది. అవును..బ్రిటీష్ ఇండియా పాస్‌పోర్టుతో విదేశాలు వెళ్లొచ్చిన మొదటి భారతీయులలో రామచంద్రయ్య కూడా ఒకరు. బెంగళూరు(అప్పటి మైసూరు)లోని దొడ్డబల్లాపూర్‌కు చెందిన రామచంద్రయ్య టీచర్, వస్త్ర వ్యాపారిగా పనిచేసేవారు. జీవితం రొటీన్‌గా సాగిపోతోందని అనుకున్న రామచంద్రయ్య.. ప్రపంచాన్ని చుట్టి రావాలని నిశ్చయించుకుని పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. 1932 నవంబరు 21న బ్రిటీష్ ప్రభుత్వం రామచంద్రయ్యకు పాస్‌పోర్టును జారీ చేసింది. వస్త్ర వ్యాపారంలో వచ్చిన లాభాలతో అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. 

1932లో మొట్టమొదటిసారిగా మద్రాసు హార్బర్ నుంచి శ్రీలంక(అప్పటి సిలాన్)కు షిప్‌లో ప్రయాణించాడు. అనంతరం కొలంబో నుంచి జపాన్, ఫిలిప్పిన్స్ వెళ్లిన ఆయన పసిఫిక్ మహాసముద్రం దాటి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చేరాడు. రామచంద్రయ్యకు కన్నడ భాష ఒక్కటే రావడంతో..ఆంగ్లం మాట్లాడగలిగిన స్నేహితుడిని కూడా వెంటబెట్టుకుని వెళ్లాడు. ఇద్దరూ అమెరికా చేరుకున్న వెంటనే వీరిని అక్కడి అధికారులు ఆపారు. కొంతమంది బ్రిటీష్ అధికారుల సహాయంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా అమెరికాలో అడుగుపెట్టగలిగారు. రోడ్డు మార్గంలో న్యూయార్క్ నగరానికి వెళ్లి అక్కడ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌ను సందర్శించారు. అమెరికా మొత్తం తిరిగేసిన ఇద్దరూ మళ్లీ షిప్ ఎక్కి లండన్ వెళ్లారు. రామచంద్రయ్య స్నేహితునికి లండన్ బాగా నచ్చడంతో కొంత కాలం అక్కడే ఉండిపోయాడు. రామచంద్రయ్య మాత్రం లండన్ నుంచి ఇటలీ, గ్రీస్, పాలస్తీనా, ఇరాక్, చైనా కూడా చుట్టేసి మళ్లీ తిరిగి లండన్ చేరుకున్నాడు. అనంతరం ఇద్దరూ కలిసి ఇండియాకు విమానం టికెట్ కొనుకున్నారు. రామచంద్రయ్య విదేశాల్లో కూడా భారత సంప్రదాయ దుస్తులైన పంచె కట్టుకుని, నెత్తిపైన టోపి(మైసూర్ పేట) పెట్టుకునే తిరిగేవారంట. లండన్ ఎయిర్‌పోర్టులో రామచంద్రయ్య టికెట్ కొనే సమయంలో అక్కడున్న వారంతా ఈయన వేషధారణ చూసి ఎవరీ మనిషి ఇలా ఉన్నాడు అని అనుకున్నారంట. లండన్ నుంచి ఇండియాలోని కరాచి(తరువాత పాకిస్థాన్‌లో కలిసిపోయింది)కి వచ్చిన అనంతరం రోడ్డు, రైలు మార్గంలో భారతదేశం కూడా మొత్తం తిరిగేసి మళ్లీ వారి స్వస్థలమైన దొడ్డబల్లాపూర్‌కు చేరుకున్నారు. 

ఇంతకీ ఈ విషయాలన్నీ ఇప్పుడెలా తెలిశాయంటారా.? రామచంద్రయ్య కుమారుడైన దేవప్రకాష్ ఈ సంగతుల్ని తెలియజేశారు. తాను ఇంజినీరింగ్ చివరి సంవత్సరం(1963)లో ఉండగా..తన తండ్రి మరణించారని..ఆ సమయంలో తన తండ్రికి సంబంధించిన వస్తువులను వెతుకుతుండగా ఆయన పాస్‌పోర్టు దొరికినట్టు దేవప్రకాష్ చెప్పారు. ఆ పాస్‌పోర్టులో ఆయన తిరిగొచ్చిన దేశాల స్టాంప్‌లు ఉన్నాయని వాటి ద్వారా తన తండ్రి ప్రపంచాన్ని ఎలా చుట్టేశారో అర్థమయిందని దేవప్రకాష్ అంటున్నారు. మరోపక్క, ప్రపంచయాత్ర గురించి తాను ఎన్నిసార్లు అడిగినా..తన తండ్రి ఎప్పుడూ చెప్పేవారు కాదని..కొన్ని విషయాలు మాత్రం తన తల్లి ద్వారా తెలుసుకున్నట్టు దేవ ప్రకాష్ తెలిపారు. దేవప్రకాష్ మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా సేవలందించి రిటైర్ అయ్యారు. కాగా, బ్రిటీష్ ప్రభుత్వంలో విదేశాలకు వెళ్లిన అతి తక్కువ భారతీయులలో రామచంద్రయ్య కూడా ఒకరు. 2016లో ఆయన పాస్‌పోర్టు వెలుగులోకి రావడంతో..ఆయన పేరు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చేరింది.