Flight-hited-the-wall-

గోడను ఢీకొట్టిన విమానం...136 మంది ప్రయాణికులు సురక్షితం

తిరుచ్చి: తమిళనాడులోని తిరుచ్చి నుంచి దుబాయ్ బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానానికి తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. తిరుచ్చి ఎయిర్‌పోర్ట్ నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా ప్రహరీ గోడ (సేఫ్టీ వాల్)ను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణుకులెవరూ గాయపడలేదు. గురువారం రాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

విమానం టేకాఫ్ అవుతుండగా రెండు చక్రాలు ఏటీసీ ప్రహరీగోడను ఢీకొట్టుకుంటూ వెళ్లిందని, ప్రమాదాన్ని గుర్తించిన పైలట్లు విమానాన్ని ముంబైకి దారి మళ్లించారని అధికారులు తెలిపారు. ముంబై విమానాశ్రయంలో ఉదయం 5.39 గంటలకు విమానం ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో ఆరుగు సిబ్బంది, 130 మంది ప్రయాణికులతో కలిపి మొత్తం 136 మంది ప్రయాణిస్తుండగా ఘటన చోటుచేసుకుంది. విమానం గోడను ఢీకొట్టిన తర్వాత కొంతసేపు ఎటీఎస్ సిగ్నల్‌తో సంబంధాలు తెగిపోయినట్టు కూడా అధికారులు చెప్పారు. అయితే ఆ తర్వాత కొన్ని గంటలకు విమానం ముంబైలో ల్యాండైనట్టు చెప్పారు. ముంబై నుంచి మరో విమానంలో ప్రయాణికులను దుబాయ్‌కు పంపారు. ప్రమాద కారణాలపై అత్యున్నత స్థాయి దర్యాప్తునకు కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ఆదేశించారు.