flight-charges-will-expensive-now--

విమాన ధరలకు రెక్కలు

క్రూడ్‌ ఎఫెక్ట్‌తో 15 శాతం పెంపు?
ముంబై : గత ఏడాది కాలంలో విమానయాన ఇంధనం (ఎటిఎఫ్‌) ధరలు 30 శాతం పెరగడంతో దూసుకుపోయిన నిర్వహణ వ్యయాలను తట్టుకోవడానికి విమానయాన సంస్థలు టికెట్‌ ధరలను పెంచవచ్చునని నిపుణుల అంచనా. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో 45 శాతం ఎటిఎ్‌ఫదే కావడం వల్ల గత ఏడాదిగా పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకుంటే టికెట్‌ ధరల్లో 15 శాతం పెరుగుదల ఉండవచ్చునంటున్నారు. అయితే ఈ విషయంపై స్పందించడానికి విమానయాన సంస్థలు సిద్ధంగా లేవు. పెరిగిన ఇంధనం ధరల భారాన్ని ఎలా భర్తీ చేసుకోవాలన్నది ఇంకా ఉన్నత స్థాయి యాజమాన్యం పరిశీలనలోనే ఉన్నదని కొందరు ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. గత ఏడాది కాలంగా ఎటిఎఫ్‌ ధరలు 30 శాతం పెరగ్గా కేవలం ఆరు నెలల్లోనే 25 శాతం పెరిగాయని గణాంకాలు తెలుపుతున్నాయి.
 
నవంబరు నుంచి ఇప్పటికి ఎటిఎఫ్‌ ధరలు 25 శాతం పెరిగినందు వల్ల టికెట్ల ధరలు పెంచక తప్పదని, కాని ఎవరు ముందు ప్రకటిస్తారన్నది మిలియన్‌ డాలర్‌ ప్రశ్న అని పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అన్నారు. ధరల పెంపు విషయంలో తాము ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నామని, ఒకపక్క పూర్తి స్థాయిలో విమానాల్లో సీట్లు నిండని పరిస్థితి కూడా ఉన్నందువల్ల ఆ కోణం నుంచి కూడా పరిశీలించాల్సి ఉందని మరో ఎయిర్‌లైన్స్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా విమానయాన చార్జీల్లో 10 నుంచి 15 శాతం వరకు పెంపు ఉండవచ్చునన్నది తమ అభిప్రాయమని కెపిఎంజిలో ఏరోస్పేస్‌, రక్షణ విభాగం ఇండియా హెడ్‌, పార్టనర్‌ అంబర్‌ దూబే అన్నారు.
 
అయితే గత కొద్ది కాలంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తగ్గిన క్రూడాయిల్‌ ధరలతో లాభం పొందినందు వల్ల ఇప్పుడు తమ వంతుగా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉన్నదని ఆయన గుర్తు చేశారు. మరోపక్క ఎటిఎఫ్‌ ధరలు అనూహ్యంగా పెరిగిపోతున్న కారణంగా వాటిని జిఎ్‌సటి పరిధిలోకి తీసుకురావాలని కూడా డిమాండు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వాలు ఎటిఎ్‌ఫపై గరిష్ఠంగా 40 శాతం వరకు వ్యాట్‌ విధిస్తున్నాయి. ఇదిలా ఉండగా విమానయాన సంస్థలు తీసుకువస్తున్న కొత్త విమానాల వల్ల సీట్ల సంఖ్య పెరిగి రెండో త్రైమాసికం వరకు విమానయాన ధరలు పెరిగే ఆస్కారం లేదని కాపా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, డైరెక్టర్‌ కపిల్‌ కౌల్‌ అన్నారు.