First-Indian-death-sentence-in-America

ఫిబ్రవరి 23న రఘుకు మరణశిక్ష!

చిన్నారి శాన్వి, ఆమె అమ్మమ్మను

కిరాతకంగా చంపిన రఘునందన్‌
అమెరికాలో మరణశిక్షకు గురయ్యే తొలి భారత సంతతి వ్యక్తి ఇతనే
పెన్సిల్వేనియా రాష్ట్రంలో మరణ శిక్షపై మారటోరియం
గవర్నర్‌ సడలిస్తేనే శిక్ష అమలు
 
వాషింగ్టన్‌, జనవరి 11: అభం శుభం తెలియని పది నెలల చిన్నారి శాన్వి.. ఆమె అమ్మమ్మ సత్యవతిని కిరాతకంగా హత్య చేసిన కేసులో యండమూరి రఘునందన్‌కు మరణ శిక్ష తేదీ ఖరారైంది. అమెరికాలో 2012లో జరిగిన ఈ జంట హత్యల కేసులో రఘునందన్‌కు 2014లో అమెరికా కోర్టు మరణ శిక్ష విధించింది. ప్రస్తుతం అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్న రఘునందన్‌కు ఫిబ్రవరి 23న మరణ శిక్ష అమలు చేయాలని స్థానిక అధికారులు నిర్ణయించారు. మరణశిక్ష అమలైతే అమెరికాలో మరణశిక్షకు గురైన తొలి ఇండో అమెరికన్‌గా రఘునంద్‌ రికార్డులకు ఎక్కుతారు. అయితే రఘునందన్‌ మరణశిక్ష వాయిదా పడే అవకాశం ఉంది. 2015 నుంచి పెన్సిలేన్వియాలో మరణశిక్షపై నిషేధం అమలవుతోంది. గత 20 ఏళ్లుగా ఇక్కడ ఒక్క మరణ శిక్ష కూడా అమలు కాలేదు. పెన్సిలేన్వియా గవర్నర్‌ మరణశిక్షపై ఉన్న నిషేధాన్ని సడలిస్తే తప్ప రఘునందన్‌కు శిక్షను అమలు చేయలేరు. శాన్వి తల్లిదండ్రులది గుంటూరు కాగా రఘునందన్‌ విశాఖపట్నంవాసి.
 
జూదానికి బానిసై..
విశాఖకు చెందిన రఘునందన్‌ అమెరికాలోని పెన్సిల్వేనియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేసేవాడు. శాన్వి తల్లిదండ్రులు వెన్నా వెంకట్‌, చెంచులత ఉండే అపార్ట్‌మెంటులోనే నివాసం ఉండే ఇతను ఆ కుటుంబంతో సన్నిహితంగా మెలిగేవాడు. గాంబ్లింగ్‌కు బానిస అయిన రఘునందన్‌ అందులో పెద్ద ఎత్తున నగదు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చేందుకు తప్పుదారి పట్టాడు. శాన్వి తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో వారి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని భావించిన రఘునందన్‌ శాన్విని కిడ్నాప్‌ చేసి డబ్బులు సంపాదించాలని భావించాడు. 2012 అక్టోబరులో శాన్విని కిడ్నాప్‌ చేశాడు. ఈ క్రమంలో శాన్వి అమ్మమ్మ వెన్నా సత్యవతిని హత్య చేశాడు. శాన్వి ఇంటి వద్ద ఓ లేఖను వదిలి వెళ్లాడు. అందులో తనకు 50వేల డాలర్లు ఇవ్వకుంటే శాన్విని చంపేస్తానని పేర్కొన్నాడు. చిన్నారిని కిడ్నాప్‌ చేసిన రఘు ఏమీ తెలియనట్లు శాన్వి తల్లిదండ్రులతో కలిసి పాపను వెతికాడు. రఘు వదిలి వెళ్లిన లేఖలో శాన్విని ముద్దు పేరుతోను, శాన్వి తల్లిని లత అని, తండ్రిని శివ అని సంబోధించడంతో చిన్నారి తల్లిదండ్రులు తమ కుటుంబానికి సన్నిహితులే పాపను కిడ్నాప్‌ చేశారన్న నిర్ధారణకు వచ్చారు. పోలీసులకూ ఇదే విషయాన్ని తెలిపారు. శాన్వి కుటుంబానికి సన్నిహితంగా ఉండే వారిని విచారించిన పోలీసులు చివరికి రఘునందనే పాపను కిడ్నాప్‌ చేశాడని తేల్చారు. అతని అపార్ట్‌మెంటులో ఓ సూట్‌కేసులో చిన్నారి శాన్వి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రఘుపై కిడ్నాప్‌, హత్య, దొంగతనం వంటి 13 నేరాలను పోలీసులు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన అమెరికన్‌ కోర్టు రఘునందన్‌కు 2014లో మరణశిక్ష విధించింది.
 
విశాఖ నుంచి అమెరికాకు
రఘునందన్‌ విశాఖపట్నం వాసి. అతని తండ్రి పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. మావోయిస్టుల దాడిలో ఆయన మృతి చెందారు. చదువులో మంచి ప్రతిభ కనబరిచే రఘు ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన అనంతరం తల్లిని విశాఖలో వదిలి 2007లో అమెరికా వెళ్లాడు. శాన్విని హత్య చేయడానికి కొన్ని నెలల ముందే రఘుకి కోమలితో వివాహమైంది. రఘు హంతకుడిగా జైలుకు వెళ్లే నాటికి కోమలి గర్భవతి. శాన్విని హత్య చేయడానికి కొన్ని గంటల ముందు అమెరికాలో ఉంటున్న తన చిన్ననాటి స్నేహితుడైన చందు తుమ్మలకు రఘు ఫోన్‌ చేశా డు. తన భార్య గర్భవతి అని, ఆమెకు సాయంగా ఉండేందుకు తన అత్తమామలను అమెరికా తీసుకురావాలనుకుంటున్నానని, వెయ్యి డాలర్లు అప్పుగా ఇవ్వాలని కోరాడు. ఆ మొత్తాన్ని చందు రఘుకు ఆన్‌లైన్‌లో బదిలీ చేశారు. ఇది జరిగిన మరుసటి రోజే రఘు.. శాన్విని కిడ్నాప్‌ చేశాడు. గాంబ్లింగ్‌కు బానిసైన రఘు అమెరికాలోని పలు కేసినోల్లో సుమారు 70వేల డాలర్లు పోగొట్టుకున్నాడు. ఇదంతా క్రెడిట్‌ కార్డుల ద్వారాను.. స్నేహితుల నుంచి అప్పుగా తీసుకున్నదే. అప్పుల ఒత్తిడి ఎక్కువై రఘు కిడ్నాప్‌ డ్రామాకు తెరదీసి హంతకుడిగా మారాడు.
 
 
ఎప్పుడు ఏం జరిగింది..
  • 2012 అక్టోబరు 22.. పెన్సిల్వేనియాలోని అప్పర్‌ మెరియన్‌ టౌన్‌షి్‌పలోని అపార్ట్‌మెంట్‌ నుంచి శాన్విని రఘు కిడ్నాప్‌ చేశాడు. ఈ క్రమంలో శాన్వి అమ్మమ్మ సత్యవతిని హత్య చేశాడు.
  • 2012 అక్టోబరు 28.. పోలీసుల విచారణలో రఘునందనే శాన్విని కిడ్నాప్‌ చేసినట్లు తేలింది. రఘు అపార్ట్‌మెంటులోని ఓ సూట్‌ కేసులో శాన్వి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
  • 2014 నవంబరు 20.. మాంట్‌గోమరీ కౌంటీ కోర్టు రఘుకు మరణ శిక్ష విధించింది.
  • 2018 జనవరి 11.. రఘునందన్‌ మరణశిక్ష తేదీని పెన్సిల్వేనియా జైలు అధికారులు ఖరారు చేశారు