Expat-fined-for-taking-womans-photo-without-permission

అనుమతి లేకుండా మహిళ ఫొటో తీసిన ఓ మహిళకు భారీ జరిమానా

అబుదాబి: గల్ఫ్ దేశమైన యూఏఈలో పలు కఠినమైన చట్టాలు అమలులో ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘించినవారు తగిన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి యూఏఈలో నివసించే విదేశీయులు అక్కడి నిబంధనల గురించి అవగాహన పెంచుకోవడం మంచిది. లేదంటే సమస్యలను కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. ఈ విషయాన్ని తెలియజేసే ఓ ఘటన యూఏఈలోని అబుదాబిలో వెలుగులోకి వచ్చింది. 

యూరప్‌ నుంచి యూఏఈకి వలస వచ్చిన ఓ మహిళ అనుమతి లేకుండా అబుదాబికి చెందిన ఓ మహిళ బీచ్‌లో ఉండగా ఫొటో తీసింది. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా ఓ వెబ్‌సైట్‌లో కూడా  ప్రచురించింది. ఈ ఫొటోను ఫొటొలోని మహిళ భర్త గుర్తించాడు. ఫొటో తీసిన మహిళపై పరువు నష్టం దావా వేశాడు. విచారణ జరిపిన న్యాయస్థానం నిందితురాలికి 1,50,000 దిర్హమ్‌ల జరిమానా విధించింది. అయితే ఈ తీర్పును నిందిత మహిళ ఉన్నతస్థాయి న్యాయస్థానంలో సవాలు చేసింది. ఫొటోను తాను చెడుగా ఉపయోగించలేదని, పర్యావరణం, పరిశుభ్రత కోసం స్వచ్ఛద్దంగా పని చేస్తానున్నామని, అంత డబ్బు చెల్లించలేనని బాధిత మహిళ పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై విచారణను డిసెంబర్ 11కు న్యాయస్థానం వాయిదా వేసింది. ఇదిలావుండగా బీచ్‌లో తీసిన ఫొటోకు ప్రైవసీ చట్టాలు వర్తించబోవని నిందిత మహిళ తరపు న్యాయవాది చెబుతున్నారు.