:: Welcome to NRI - Article ::

ఎన్నికల ముంగిట హిల్లరీకి షాక్‌!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సరిగ్గా పదిరోజుల్లో ఎన్నికలు జరుగనుండగా.. ఆమె ఈ-మెయిల్స్‌ స్కాం కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎ్‌ఫబీఐ) నిర్ణయించింది. హిల్లరీ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు తన వ్యక్తిగత ఈ-మెయిల్‌ సర్వర్‌ నుంచి చట్టవిరుద్ధంగా అధికారిక కార్యకలాపాలు నిర్వహించారనేది అభియోగం. గతంలో దర్యాప్తు చేసిన ఎఫ్‌బీఐ ఆమెను ప్రాసిక్యూట్‌ చేయనవసరం లేదని తెలిపింది. ఇప్పుడు వేరే కేసులో దర్యాప్తు జరుపుతుండగా.. ఈ-మెయిల్స్‌ స్కాంలో మరికొన్ని ఆధారాలు బయటపడ్డాయి. దీంతో పునర్విచారణకు ఎఫ్‌బీఐ నిర్ణయించింది. దీనిపై రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తంచేశారు. ఇప్పటిదాకా జరిగిన సర్వేల్లో హిల్లరీ పూర్తి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఇప్పుడు ఆకస్మికంగా ఈ-మెయిల్స్‌ స్కాం మెడకు చుట్టుకోవడంతో ఎదురుదెబ్బ తగులుతుందేమోనని ఆమె ప్రచార కమిటీ ఆందోళన చెందుతోంది.
8 శాతం వృద్ధితో భారత్‌ దూసుకెళ్తోంది: ట్రంప్‌
రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ భారత ఆర్థికాభివృద్ధి గమనాన్ని ప్రశంసించారు. ఎనిమిది శాతం వృద్ధి సాధించిందని, అమెరికా ఇలా ఎందుకు ఎదగలేకపోయిందని అమెరికా అఽధ్యక్షుడు బరాక్‌ ఒబామాను నిలదీశారు. న్యూహాంప్‌షైర్‌లోని మాంచెస్టర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. అలాగే భారత్‌ నుంచి అమెరికా వస్తున్న హైటెక్‌ ఐటీ ప్రొఫెషనల్స్‌కు గ్రీన్‌కార్డుల జారీపై సానుకూలంగా మాట్లాడారు. ‘ఎంతోమంది గ్రీన్‌కార్డుల కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. వ్యవస్థను హేతుబద్ధం చేస్తాం. బయటి దేశాల నిపుణులు చట్టబద్ధంగా అమెరికాకు రావాలని కోరుకుంటున్నాం. ప్రతిభావంతులే రావాలనుకుంటున్నాం’ అని స్పష్టం చేశారు. కాగా, అన్ని సర్వేల్లో భారీ తేడాతో ఆధిక్యంలో ఉన్నప్పటికీ సంతృప్తి చెందరాదని, అలసత్వం పనికిరాదని డెమోక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ తన మద్దతుదారులను హెచ్చరించారు. ట్రంప్‌కు గెలిచే అవకాశం ఇంకా ఉందన్నారు.