donald-trumps-daughter-in-law-hospitalised

ఆస్పత్రిపాలైన డొనాల్డ్ ట్రంప్ కోడలు..కారణం ఇదే..

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోడలు ఆస్పత్రిపాలయ్యారు. గుర్తు తెలియని దుండగులు ట్రంప్ పెద్ద కొడుకు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ చిరునామాకు ఓ పార్శిల్‌ను పంపించారు. ఈ పార్శిల్లో అంతుచిక్కని తెల్లరంగు పౌడర్ ఉంది. ఈ పార్శిల్‌ను డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ భార్య వనెస్సా ట్రంప్ తెరచింది. వాసనతో ఆమె అస్వస్థకు గురయ్యారు. వికారంగా అనిపించడంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. నిపుణులైన వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు పార్శిల్లోని పౌడర్ హానికరమైనది కాదని తేల్చారు. వనెస్సాతోపాటు అక్కడే ఉన్న మరో ఇద్దరు కూడా అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్లో చికిత్సపొందున్నారు. వీరి ముగ్గురికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు.

ఈ పార్శిల్‌ను ఎవరు పంపించారు, ఎందుకు పంపించారనే అంశాలపై న్యూయార్క్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పార్శిల్ ద్వారా ఈ పౌడర్‌ వచ్చిందని, డొనాల్డ్ ట్రంప్ జూనియర్ చిరునామాకు పంపించారని న్యూయార్క్ పోలీసు అధికారి డార్లోస్ నివీస్ తెలిపారు. ఇదిలావుండగా గుర్తుతెలియని వ్యక్తులు పంపిస్తున్న పార్శిల్స్ పట్ల న్యూయార్క్ పోలీసులు 2001 నుంచి అప్రమత్తంగా ఉంటున్నారు. గుర్తు తెలియని దుండగులు 2001లో హానికరమైన ఆంత్రాక్స్‌కు గురిచేసే బ్యాక్టీరియాను పార్శిల్స్ ద్వారా పలువురికి పంపించారు. ఈ పరిణామాలతో ఐదుగురు చనిపోయారు. అప్పటినుంచి పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉంటున్నారు. అయినప్పటికీ ట్రంప్‌ కొడుకు చిరునామాకు ఇలాంటి పార్శిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దర్యాప్తును ముమ్మరం చేశారు.