death-of-love-story-in-Kashmir

ఎల్లలు దాటిన ప్రేమపై పేలిన తూటా

ఇండోనేషియా యువతి.. కశ్మీర్‌ యువకుడు..

హైదరాబాద్‌లో ప్రేమ పెళ్లి!..
కశ్మీర్‌ కాల్పుల్లో యువకుడు మృతి
 
వారిద్దరికీ ఒకరికొకరు తెలీదు. ఒకే దేశం కూడా కాదు. కానీ తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. రెండేళ్ల తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వారి అనుబంధానికి గుర్తుగా పాప కూడా జన్మించింది. అలా.. హాయిగా సాగిపోతున్న వారి జీవితాన్ని కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ ఒక్కసారిగా మార్చేసింది. సైనికుల తుపాకుల నుంచి దూసుకొచ్చిన తూటా వారి ప్రేమను చిదిమేసింది. ఇండోనేషియా రాజధాని జకర్తాకు చెందిన వైవిక్‌ విదియాసాతి (సైమా) యునైటెడ్‌ హెల్త్‌ గ్రూప్‌లో ఆరు నెలల శిక్షణ కోసం 2014లో హైదరాబాద్‌కు వచ్చింది. కశ్మీర్‌కు చెందిన అబిద్‌ హుస్సేన్‌ కూడా బెంగళూరులో ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం నగరానికి వచ్చాడు. ఇక్కడే ఇద్దరికీ పరిచయమైంది. ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొద్దిరోజులకే సైమా ఇండోనేషియా వెళ్లిపోయింది. ఇద్దరూ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. వారిద్దరి మధ్య ప్రేమ అలాగే ఉండిపోయింది. ఆన్‌లైన్‌లో తరచూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. రెండేళ్ల తర్వాత.. ఇండోనేషియా వెళ్లిన అబిద్‌ అక్కడే అమెను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి హైదరాబాద్‌ వచ్చారు. కొద్దిరోజులు ఉద్యోగం చేశారు. కానీ సొంతూరుపై మమకారంతో కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా సిర్నూ గ్రామానికి భార్య, కూతురును తీసుకుని వెళ్లాడు అబిద్‌. అయిష్టంగా వెళ్లినా ఆమెకు కశ్మీర్‌ ఒక స్వర్గంలా కనిపించింది. చూస్తుండగానే ఏడు నెలలు గడిచాయి. ఇంతలో ఊహించని విషాదం.
 
డిసెంబరు 15న పుల్వామాలోని సిర్నూ గ్రామంలో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే.. ఈ ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనకు దిగడంతో పాటు సైన్యంపై రాళ్లు రువ్వారు. పరిస్థితి విషమించడంతో సైనికులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు పౌరులు మృతి చెందారు. వారిలో అబిద్‌ కూడా ఉన్నారు. అప్పటికే అక్కడికి వెళ్లొద్దని అబిద్‌ను సైమా హెచ్చరించింది. కానీ అతను వినకుండా.. ఇప్పుడే వస్తానని వెళ్లాడు. ఆందోళనకారులతో పాటు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసిన సైమా కుప్పకూలిపోయింది. భూలోక స్వర్గం ఒక్కసారిగా ఆమెకు నరకంలా అనిపించింది. భాష కూడా తెలియని ప్రాంతంలో ప్రేమ కోసం వచ్చి సైమా ఒంటరిగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఇండోనేషియా ఎంబసీ అధికారుల సాయంతో స్వదేశానికి తిరిగి వెళ్లే ప్రయత్నాల్లో ఉంది.