:: Welcome to NRI - Article ::

ఆ ముష్టిఘాతం అతన్ని ఆసుపత్రి పాల్చేసింది

సిడ్నీ: ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ యువకుడు అగంతకుడి ముష్టిఘాతంతో ఆసుపత్రి పాలయ్యాడు. కన్ను, ముక్కు తీవ్రంగా కమిలిపోయి తీవ్రంగా గాయపడిన 18 ఏళ్ల ఆ టీనేజర్ తనపై జరిగిన దాడి కారణంగా హెచ్‌ఎస్‌సీ పరీక్షలకు హాజరుకాలేకపోయాడు. ఈనెల 7వ తేదీ అర్ధరాత్రి బాండీ బీచ్ ఫాస్ట్ ఫుడ్‌ సెంటర్‌లో టామ్ బ్లాన్‌పై ఈ దాడి జరిగింది. ఆ ఘటన తలుచుకుంటే ఇప్పటికీ అతను వణికిపోతున్నాడు. గతంలో తనకెప్పుడూ ఇలాంటి అనుభవం లేదని టామ్ బ్లాన్ చెప్పాడు. 'ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌లో కూర్చుకున్నప్పుడు గందరగోళం, అరుపులు వినిపించాయి. ఆ విషయం నేను గ్రహించేసరికి అక్కడున్న గుంపు నన్ను చుట్టుముట్టింది' అని ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ చెప్పాడు టామ్. అతనిపై జరిగిన దాడి కెమెరాకు చిక్కకపోయినా, సమీపంలోనే సీసీటీవీ పుటేజ్‌ను పోలీసులు సేకరించారు. తెలుపురంగు షర్ట్ ధరించిన ఒక వ్యక్తి ముష్టిఘాతం విసిరేముందు బెదరిస్తున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. ప్రస్తుతం కోలుకుంటున్నప్పటికీ పరీక్షలు రాయగలిగిన పరిస్థితులో లేనందున ఇంటిలోనే ఉన్నట్టు టామ్ తెలిపాడు. అగంతకుడి దాడి వల్ల తన కుమారుడు పరీక్షలకు ప్రిపేర్ కాలేకపోయాడని టామ్ తల్లి మేగన్ బ్లాన్ వాపోయింది. పరీక్ష రాయలేకపోయానన్న బాధ తన కొడుకుని కృంగదీసిందని తెలిపింది. దాడి అనంతరం తన కుమారుడిని బయటకు పంపాలనంటేనే భయంగా ఉందని తెలిపింది.