congress-leaders-in-Dubai

తప్పుడు ట్వీట్లతో మోదీ ప్రచారం: దుబాయిలో కాంగ్రెస్ నేతలు

(ఆుధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి) శాసనసభ ఎన్నికల్లో అభ్యర్ధుల ఖరారు, పొత్తు స్ధానాలపై విస్తృత చర్చల హడావుడిలో ఉండి కూడా  కాంగ్రెస్ అగ్రనాయకులు ప్రత్యేకంగా శుక్రవారం గల్ఫ్ పర్యటనకు రావడం జరిగింది. దీంతో మాతృభూమిలోని తెలంగాణ ప్రవాసీల కుటుంబాల ఓట్లపై కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక ఆకర్షణకు శ్రీకారం చుట్టింది. దుబాయిలో పనిచేస్తున్న తెలంగాణ ప్రవాసులను కలుసుకోవడానికి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు పార్టీ అభిమానులు ప్రవాసీ కాంగ్రెస్ నాయకుడు యస్.వేణురెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, పిసీసీ అధ్యక్షుడు యన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎఐసీసీ కార్యదర్శి మధుయాష్కి గౌడ్‌లు న్యూఢిల్లీ నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం దుబాయి చేరుకున్నారు.

వారు గురువారం రాత్రి న్యూఢిల్లీ నుంచి బయలుదేరాల్సి ఉన్నా మహాకూటమి స్ధానాల విషయమై చర్చలు సాయంత్రం వరకు కొనసాగడంతో గురువారం రాత్రి రాలేకపోయారు, కానీ శుక్రవారం ఉదయం దుబాయి వచ్చారు. సిఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీ దౌత్యవేత్త బి.వినోద్ కుమార్ మాత్రం నేరుగా హైదరాబాద్ నుంచి బయలుదేరి గురువారం అర్ధరాత్రి దుబాయికి చేరుకున్నారు. తమ ప్రభుత్వం ప్రవాసుల సంక్షేమానికి ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను నెలకొల్పిందని, వారి సంక్షేమానికి కృషి చేస్తే, నరేంద్రమోదీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని, ట్వీట్లతో అబద్దపు ప్రచారానికి ఒడిగట్టిందని ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా విమర్శించారు. గల్ఫ్ లోని తెలంగాణ ప్రవాసుల సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. గల్ఫ్‌లోని పరిస్ధితుల వల్ల స్వదేశానికి తిరిగి వెళ్ళే ప్రవాసీయుల కొరకు బీమా మరియు పునరావాస పథకాలను తాము ప్రవేశపెడతామని ఆయన అన్నారు. వివిధ కేసుల్లో మగ్గుతున్నవారికి న్యాయసహాయం అందించే విధానాన్ని మెరుగుపరుస్తామని కూడా కుంతియా తెలిపారు. ఉత్తర తెలంగాణ ఆర్ధిక వ్యవస్ధలో గల్ఫ్ పాత్రను విస్మరించలేమని జీవన్‌రెడ్డి అన్నారు. అనేక గ్రామాల నుంచి కనీసం 10 శాతం నుండి 50 శాతం మంది వరకు గల్ఫ్‌లో పని చేస్తున్నారని ఆయన అన్నారు.