:: Welcome to NRI - Article ::

చైనాపై దాడికి కిమ్ ప్రణాళిక?

బీజింగ్/ప్యాంగ్‌యాంగ్/వాషింగ్టన్: అమెరికా చెప్పినట్లు చైనా నడుచుకుంటోందా?. ఉత్తరకొరియాపై ఐరాసలో విధించిన ఆంక్షలను చైనా ఎందుకు సమర్థించింది?. ఆంక్షల విధించడంపై ఆగ్రహంతో రగిలిపోతున్న కిమ్ చైనాపై దాడికి సిద్ధమవుతున్నారా?.. అనే ప్రశ్నలకు నిపుణుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. చైనాను హెచ్చరించేందుకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సిద్ధమవుతున్నారని, దాడి చేసేందుకు ప్రణాళికలు కూడా రచిస్తున్నారని పేర్కొంటున్నారు. ఉత్తరకొరియాలోని దక్షిణ ప్రాంతంలోని వాంగ్జు నుంచి పశ్చిమ ప్రాంతంలోని  నాంపో ప్రాంతానికి 30 క్షిపణులను కిమ్ తరలించారు. ఈ చర్యే కొత్త వాదనకు  కారణమైంది. ఆ ప్రాంతంలో క్షిపణులను మోహరించడం వల్ల ఉత్తరకొరియా దాడి చేసే పరిధిలోఅమెరికా, జపాన్ ఉండవు. కానీ ఆ ప్రాంతానికి క్షిపణులను తరలించడం వెనుక పెద్ద కారణమే ఉందని, చైనాపై దాడి లేదా హెచ్చరికే లక్ష్యంగా కిమ్ ఈ చర్యకు దిగారని నిపుణులు చెపుతున్నారు. వచ్చే బుధవారం చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం లక్ష్యంగా దాడి చేసే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. అమెరికాకు అనుకూలంగా చైనా మెలగడమే కిమ్ ఆగ్రహానికి కారణమని, ఐరాస ఆంక్షలు ఆయన ప్రధాన కారణమని పేర్కొంటున్నారు.