china-planning-to-check-america

అమెరికాకు చెక్‌ పెట్టేందుకు చైనా వ్యూహం

భారత్‌ సహకారంపై దృష్టి

న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య యుద్ధానికి చైనా.. భారత్‌ సహకారం కోరుతోంది. వాణిజ్య పరంగా స్వీయ రక్షణ చర్యలతో ఏకపక్ష విధానాన్ని అవలంభిస్తున్న అమెరికాతో పోరాడేందుకు భారత్‌, చైనాల మధ్య సహకారం మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఇండియాలో చైనా దౌత్య కార్యాలయ ప్రతినిధి జి రాంగ్‌ అన్నారు. అమెరికా వాణిజ్య విధానాలు చైనాతోపాటు భారత ఆర్థిక వృద్ధిపైనా ప్రభావం చూపనున్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. గతనెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. వారి దేశంలోకి దిగుమతయ్యే చైనా ఉత్పత్తులపై 20,000 కోట్ల డాలర్ల విలువైన సుంకాలు విధించారు. అందుకు ప్రతీకారంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై చైనా 6000 కోట్ల డాలర్ల విలువైన సుంకాలను వడ్డింది. చైనా మరోసారి ప్రతీకార చర్యలకు పాల్పడితే అదనంగా 26,000 కోట్ల డాలర్ల సుంకాలు విధిస్తామని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది.