:: Welcome to NRI - Article ::

లండన్‌లో టాక్ ఆధ్వర్యంలో ‘చేనేత బతుకమ్మ’

లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆద్వర్యంలో సెప్టెంబర్ ౩౦వ తేదీన నిర్వహిస్తున్న  "లండన్ - చేనేత బతుకమ్మ- దసరా" వేడుకల పోస్టర్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో ఎంపీ కవితను బుధవారం టాక్ ప్రతినిధులు రాజ్ కుమార్ శానబోయిన, సుభాష్ కుమార్ కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనివ్వడానికి చేస్తున్న కార్యక్రమాలకు స్పూర్తితో, ఈ సంవత్సరం టాక్ జరిపే వేడుకలను "చేనేత బతుకమ్మ" గా నిర్వహిస్తున్నామని, వీలైనంత వరకు ప్రవాసులల్లో చేనేత పై అవగాహన కల్పిస్తామన్నారు. వీలైనన్ని సందర్భాల్లో చేనేత వస్త్రాలు ధరించి నేత కుటుంబాలకు అండగా నిలవాలని ప్రవాసులకు సూచిస్తామని తెలిపారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కవిత ఆకాంక్షించారు.

లండన్ నుండి టాక్ అధ్యక్షురాలు పవిత్ర. ఓ ప్రత్యేక పత్రిక ప్రకటన విడుదల చేశారు.  టాక్ సంస్థ ఆవిర్భావం నుంచి నేటి వరకు అన్ని సందర్భాల్లో ఎంపీ కవిత ప్రోత్సాహం చాలా గొప్పదని, నేటి "చేనేత బతుకమ్మ" పోస్టర్ ఆవిష్కరించి తమలో నూతన ఉత్సాహాన్ని నింపినందుకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేస్తినట్టు ఆమె చెప్పారు. గతంలోనే లండన్ పర్యటనకు వచ్చిన సందర్భంలో "చేనేత బతుకమ్మ" ఆలోచనను కవితకు వివరించామని, ఆమె కూడా తమకు ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చి ప్రోత్సహించారన్నారు.

సెప్టెంబర్ ౩౦వ తేదీన ఉదయం పది గంటల నుంచి వెస్ట్ లండన్‌లోని "ఐసల్ వర్త్ అండ్  సయాన్ స్కూల్"( Isleworth and Syon School,Ridgeway Road, Isleworth, Middlesex, TW75LJ) ఆడిటోరియంలో ‘చేనేత బతుకమ్మ’ను  ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పవిత్ర తెలిపారు. ప్రవాసీయులంతా వీలైతే చేనేత దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. చేనేత వస్త్రాల కోసం www.tauk.org.uk వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చునన్నారు.
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చేనేత చీరలను అందిస్తోందని, ప్రవాసులం కూడా కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా, ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న అన్ని బతుకమ్మ వేడుకల్లో చేనేతకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. హైదరాబాద్‌లో ఎంపీ కవిత ఆధ్వర్యంలో జరిగిన ‘చేనేత బతుకమ్మ’  పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న టాక్ ప్రతినిధులు రాజ్ కుమార్, సుభాష్‌, జాగృతి నాయకుడు సంతోష్ రావు కొండపల్లికి, అలాగే జాగృతి రాష్ట్ర నాయకులు శరత్ రావు, ప్రణీత్ రావు, నవీన్ ఆచారి, విజయ్ కోరబోయన, భిక్షపతి,  రోహిత్ రావుకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.