:: Welcome to NRI - Article ::

దుబాయి రాజ వంశీకుడితో ఏపీ సీఎం చంద్రబాబు స్పెషల్ మీటింగ్

అమరావతి/న్యూఢిల్లీ, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): దుబాయి సివిల్ ఏవియేషన్ అథారిటీ సీఈవో, ఎమిరేట్స్ గ్రూప్ చైర్మన్ అయిన షేక్ అహ్మద్ బిన్ మక్ధూమ్‌తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. దుబాయి మాజీ రాజు సయీద్ బిన్ మక్ధూమ్ బిన్ హషెర్ అల్ మక్ధూమ్ చిన్నకుమారుడు,  ప్రస్తుత దుబాయి రాజు మహ్మద్ బిన్ రషీద్‌కు బాబాయి అయిన ఆయనతో  చంద్రబాబు ఏపీలో పెట్టుబడుల విషయమై పలు కీలక చర్చలు జరపనున్నారు. ఈ నెల 18 నుంచి 26 వరకు 9 రోజుల పాటు చేయనున్న విదేశీ పర్యటనలో ఈ సమావేశం జరుగుతుంది. అమెరికా, దుబాయి, లండన్ పర్యటనల్లో పలు కీలక సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. పెట్టుబడుల ఆకర్షణ, రాజధాని నిర్మాణాల ఆకృతులకు తుదిరూపు తేవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. 18 నుంచి 21 వరకు అమెరికాలో పర్యటించి పెట్టుబడిదారులు, ప్రవాసాంధ్రులను కలుస్తారు. 22, 23 తేదీల్లో దుబాయ్‌లో జరిగే పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొంటారు. ఈ రెండు రోజుల్లోనే అహ్మద్ బిన్ మక్ధూమ్‌తో సమావేశం అవుతారు. అనంతరం అమరావతిలో నిర్మించే ఐకానిక్‌ భవనాల నిర్మాణ డిజైన్లను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునేందుకు లండన్‌ వెళ్తారు.