Boy-accuses-teacher-of-molesting-him-at-Abu-Dhabi-school

ఉపాధ్యాయుడు నన్ను లైంగికంగా వేధించాడు: ఓ బాలుడు

అబుదాబి: తరగతి గదిలోని బ్లాక్ బోర్డుపై స్త్రీ, పురుష నగ్న చిత్రాలు గీసిన ఉపాధ్యాయుడు తనను లైంగికంగా వేధించారని ఓ బాలుడు చెపుతున్నాడు. ఈ మేరకు నిందిత ఉపాధ్యాయుడిపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే లైంగికంగా వేధించారు. బ్లాక్‌బోర్డుపై స్త్రీ, పురుష నగ్న చిత్రాలు గీసి తన వద్దకు వచ్చి అసభ్యకరంగా తాకారు. బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన తనను నిలువరించారు. గది తాళాలు వేశారు. కొద్దిసేపటి తర్వాత బయటపడిన తాను స్కూల్లోని సోషల్ వర్కర్‌కు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఫిర్యాదులో బాలుడు పేర్కొన్నాడు. 

నిందిత ఉపాధ్యాయుడి వాదన మరోలావుంది. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని ఆయన చెపుతున్నారు. నిందిత ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడలేదని, క్లాస్ లీడర్‌గా మరో బాలుడిని నియమించడంతో బాలుడు ఇలా ప్రవర్తిస్తున్నాడని, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని ఉపాధ్యాయుడి తరపు న్యాయవాది వాదిస్తున్నారు. తరగతి గదిలో అనేకమంది విద్యార్థులు ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం అసాధ్యమని, బాలుడి ఆరోపణల్లో నిజంలేదని ఆయన చెపుతున్నారు. ఈ కేసుపై అబుదాబి క్రిమినల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టెన్స్‌లో విచారణ కొనసాగుతోంది. విచారణ మార్చి 28కి వాయిదా పడిందని పోలీసులు తెలిపారు.