atomic-danger-

గంగానదికి అణు ముప్పు

‘నందాదేవి’పై కనిపించకుండా పోయిన అణు ఇంధన పరికరం
చైనాపై నిఘాకు 1965లో పర్వతంపై అమర్చిన భారత్‌, సీఐఏ
గంగానదిలో కలిస్తే లక్షలాది ప్రాణాలకు పెను ప్రమాదం
న్యూఢిల్లీ/వాషింగ్టన్: పాపాలు పోగొడుతుందని చెప్పే గంగా స్నానం.. ప్రాణాంతకమైతే? అడుగడుగునా పవిత్రత ఉప్పొంగే ఆ గంగమ్మ తల్లి అణువ్యర్థాలతో విషతుల్యమైతే? అసలేం జరుగుతోందో తెలిసేలోపే వేలాది ప్రాణాలకు పెనుప్రమాదం!! దాదాపు ఐదు దశాబ్దాల క్రితం భారత్‌, అమెరికా శాస్త్రజ్ఞులు చేసిన పొరపాటుకు ఎప్పటికైనా భారీ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది!! 1964లో చైనా తొలి అణు పరీక్షను నిర్వహించినప్పుడు అమెరికా అప్రమత్తమైంది. చైనా అణుసామర్థ్యంపై నిఘా పెట్టేందుకు హిమాలయసానువుల్లో ఒకటైన నందాదేవి పర్వతంపై అత్యంత రహస్యంగా ఒక న్యూక్లియర్‌ సెన్సర్‌ను ఏర్పాటు చేయాలని భావించింది. దీనికి భారత్‌ అంగీకారం తెలపడంతో 1965 జూన్‌ 23న అలస్కాలో ట్రయల్‌ రన్‌ నిర్వహించిన సీఐఏ సిబ్బంది.. అణు ఇంధనంతో పనిచేసే నిఘా పరికరాన్ని నందాదేవి పర్వతంపై అమర్చేందుకు వెళ్లారు. కానీ.. అక్కడ ప్రతికూల వాతావరణం ఎదురవడంతో పని పూర్తికాకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. 

కష్టపడి పైకి తీసుకెళ్లిన ఆ పరికరాలను, ప్లుటోనియం క్యాప్స్యూల్స్‌ను.. తీసుకురాలేని పరిస్థితిలో వారు అక్కడే వదిలేశారు. వాతావరణం చక్కబడ్డాక మళ్లీ పైకి వెళ్తే ఆ పరికరాలు, క్యాప్స్యూల్స్‌.. ఏవీ అక్కడ లేవు. వాటిని కనిపెట్టి కిందకు తెచ్చేందుకు 1966, 1977లో ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. ఇదంతా రహస్యంగా నిర్వహించిన ఆపరేషన్‌ కావడంతో బయటపడలేదు. ఇప్పటికీ ఆ జనరేటర్‌, క్యాప్స్యూల్స్‌ అక్కడే ఎక్కడో ఉన్నాయి. ‘ప్లుటోనియం క్యాప్స్యూల్స్‌ ఆయుర్దాయం వందేళ్లు. ఇప్పటికే 53 ఏళ్లు పూర్తయ్యాయి. మరో 47 ఏళ్లు ఆగాల్సిన పరిస్థితి. అంతలోపే అవి కరిగి ఆ ప్రాంతం గుండా ప్రవహించే గంగ నీళ్లలో కలిస్తే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారని ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న కెప్టెన్‌ మన్మోహన్‌ సింగ్‌ కోహ్లీ(88) తెలిపారు.