:: Welcome to NRI - Article ::

ఇద్దరు సౌదీ పౌరులు.. తమ చావును తామే రికార్డు చేసుకున్నారు

రియాధ్: భయంకరమైన కారు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించిన సంఘటన సౌదీలో కలకలం రేపుతోంది. ఈ ఘటన జరిగిన స్థలంలో దొరికిన ఫోన్‌లో కనిపించిన ఓ వీడియో ఈ ప్రమాదానికి కారణమేంటో తెలియజేసింది. సౌదీ అరేబియాకు చెందిన ఇద్దరు స్నేహితులు అల్ రేయాన్, అల్ బిషాహ్ నగరాలను కలుపుతున్న రహదారిపై కారులో వెళ్తున్నారు. ఓ స్నేహితుడు కారును నడుపుతుండగా.. మరో స్నేహితుడు మొబైల్‌లో వీడియోను తీస్తున్నాడు. అయితే ఆ సమయంలో వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ జోకులేసుకుంటున్నారు. కారును నడిపే యువకుడు డ్రైవింగ్‌పై దృష్టిపెట్టకుండా.. మొబైల్‌లో చూస్తూ కేరింతలు వేయడంతో.. ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని చూసుకోలేకపోయాడు. దీంతో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. అత్యంత వేగంగా దూసుకెళ్తూ వేరే కారును ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టింది. చివరకు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వారి శరీర భాగాలు నుజ్జునుజ్జయిపోయాయి. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు.. అక్కడ దొరికిన ఫోన్‌లో ఓ వీడియోను చూశారు. దీంతో కారు నడుపుతూ వీడియో తీయడం వల్లే ఈ దారుణం జరిగిందని నిర్ణయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువకుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఫోన్‌లో ఉన్న వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కారును నడుపుతూ మొబైల్‌ను వాడటం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని పేర్కొంటూ రియాధ్ పోలీసు శాఖ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది.