Arab-employers-Shocks-his-House-maid

పనిమనిషిని ఆశ్చర్యపరచిన అరబ్ యజమాని

రియాద్: గల్ఫ్ దేశాల్లో పనిమషులుగా పనిచేస్తున్న విదేశీ మహిళలు హింసకు గురవుతున్నారని, కష్టాలను అనుభవిస్తున్నారంటూ తరచూ వార్తల్లో చూస్తుంటాము. ఇదేకోవకు చెందిన ఎంతోమంది గల్ఫ్ బాధిత మహిళల గురించి వింటుంటాము. దీంతో అక్కడి అరబ్‌ యజమానులు క్రూరంగా వ్యవహరిస్తారనే అభిప్రాయాన్ని కలిగిస్తుంటాయి. కానీ అందరూ అలాంటి వ్యక్తులే ఉండరని, ఆపన్న హస్తం అందించే దయాగుణం కలిగిన యాజమానులు ఉంటారని ఓ అరబ్ కుటుంబం నిరూపించింది. తమ ఇంట్లో పనిమనిషిగా కష్టపడిన పేద మహిళకు కనీసం ఇల్లు కూడా లేదని, పిల్లలు గుడిసెలో నివసిస్తున్నారని తెలుసుకున్న కుటుంబం తమ దయాగుణాన్ని చాటుకుంది. మానవత్వం కలిగిన అరబ్ యజమానులు ఉంటారని నిరూపించింది. 

ఫిలిప్పైన్స్‌కు చెందిన మేయ్ శాన్ పెడ్రో అనే 31 ఏళ్ల మహిళ సౌదీఅరేబియాలోని ఓ అరబ్ కుటుంబంలో పనిమనిషిగా పని చేసింది. కొంతకాలం కష్టపడిన తర్వాత ఇంటికి వెళ్లింది. అయితే తమ ఇంట్లో పని చేసిన శాన్ పెడ్రో చాలా పేద మహిళ అని, ముగ్గురు పిల్లలతో ఆమె ఓ గుడిసెలో నివసిస్తోందని తెలుసుకున్నారు. హృదయం తరుక్కుపోవడంతో శాన్ పెడ్రోకు ఆర్థిక సహాయం చేయాలని కుటుంబం భావించింది. అనుకున్నదే తడవుగా అత్యంత ఖరీదైన బహుమతులను కొనుగోలు చేసి ఆమెకు పంపించారు. పిల్లలకు ఉపయోగపడే అనేక లగ్జరీ వస్తువులను పంపించారు. అంతేకాదు ఆ కుటుంబం ఇల్లు కట్టుకుని నివసించమంటూ 34 వేల దిర్హమ్స్ పంపించారు. భారతీయ కరెన్సీలో ఈ డబ్బు మొత్తం రూ. 6 లక్షలకుపైగా ఉంటుంది. తాను పని చేసిన యజమానులు భారీగా బహుమతులు, నగదు పంపించారని తెలుసున్న శాన్ పెడ్రో ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. సంతోషంతో ఉబ్బితబ్బిబవుతోంది. ఇళ్లు కట్టుకుని అందులో నివసిస్తామని తెలిపింది. అరబ్ యజమానులు అందరూ కఠినంగా ఉండరని చెప్పడానికి ఇదే నిదర్శమని ఆమె సంతోషంతో తెలిపింది.