AP-Govt-started-two-new-services-for-NRIs

ప్రవాసాంధ్రుల కోసం ఏపీలో రెండు ప్రత్యేక సర్వీసులు

మీ పెట్టుబడికి మాదీ పూచీ.. 

పరిశ్రమలు, ఆస్తుల రక్షణ బాధ్యత పూర్తిగా పోలీసులదే
ప్రవాసాంధ్ర తెలుగువారికి డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ భరోసా
ఫిర్యాదుల కోసం రెండు సెల్స్‌
టోల్‌ ఫ్రీ: 1800 300 26234
హెల్ప్‌లైన్‌: 94407 00830

అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): జన్మభూమిపై ప్రేమతో రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి పెట్టుబడులు పెడుతున్న ప్రవాసాంధ్రుల పరిశ్రమలు, ఆస్తులకు పోలీసుశాఖ పూర్తి రక్షణ కల్పిస్తుందని డీజీపీ ఠాకూర్‌ భరోసా ఇచ్చారు. ప్రపంచంలోని పలు దేశాల్లో స్థిరపడిన 25 లక్షల మంది తెలుగువారికి రాష్ట్రంలో ఎలాంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం తరపున అందిస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం ఈ మేరకు రెండు సర్వీసులను ఆయన ప్రారంభించారు. అందులో మొదటిది ‘ఏపీ ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ సెల్‌’ కాగా...రెండోది ‘ఏపీ ఎన్‌ఆర్‌ఐ గ్రీవెన్స్‌ రిడ్రసల్‌ సెల్‌’. సీఐడీ చీఫ్‌ అమిత్‌ గార్గ్‌ నేతృత్వంలో ఈ రెండు విభాగాలు పని చేస్తాయి.
 
ఇతర దేశాల్లో స్థిరపడిన ఆంధ్రులకు అవి సేవలు అందిస్తాయి. విభజన తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే ఎన్‌ఆర్‌టీ(నాన్‌ రెసిడెన్స్‌ తెలుగువారు)లకు సురక్షిత వాతావరణం కల్పించడం తమ బాధ్యతగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా డీజీపీ వివరించారు. ఎన్‌ఆర్‌టీల పరిశ్రమల నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు తలెత్తినా, ఆస్తుల ఆక్రమణకు సంబంధించి రక్షణ కావాలన్నా, పరిశ్రమల పరిసరాల్లో శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్‌ నిబంధనలు, ఆందోళనలపై పోలీసు సలహా, పరిశ్రమల్లో విదేశీ ఉద్యోగులకు వీసా సమస్యలు, విదేశీ ఉద్యోగులు-కార్మికులకు సురక్షిత నివాసం, స్థానిక పోలీసుల సహకారం, సైబర్‌ నేరాలు ఇతరత్రా ఎలాంటి సమస్యలు ఎదురైనా సేఫ్టీ సెల్‌ను సంప్రదించవచ్చన్నారు. పరిశ్రమలు, ఐటీ, ఫార్మా, సీనియర్‌ పోలీసులు, సీఐఐ ప్రతినిధులు, ఏపీ వాణిజ్య సమాఖ్య, తెలుగు ప్రవాస భారతీయులు అందరూ ఈ సెల్‌లో భాగంగా ఉంటారని చెప్పారు. ప్రపంచం నలుమూలల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని, వాట్సా్‌ప/మొబైల్‌ హెల్ప్‌లైన్‌: 94407 00830 లేక 24/7 కాల్‌ సెంటర్‌ (టోల్‌ ఫ్రీ నంబర్‌) 1800 300 26234కు ఫోను చేయవచ్చన్నారు. దేశంలో ఇటువంటి విభాగం ఏ రాష్ట్రంలోనూ లేదని డీజీపీ చెప్పారు. .
 
చీటింగ్‌ అల్లుళ్లకు చెక్‌
అమెరికా అల్లుడు వరకట్నంకోసం వేధిస్తున్నా.. గృహహింసకు పాల్పడుతు న్నా.. ఏపీ ఎన్‌ఆర్‌ఐ రిడ్రసల్‌ గ్రీవెన్స్‌ సెల్‌కు ఫిర్యాదు చేయవచ్చు. భార్యను ఇక్కడ వదిలేసి విదేశాల్లో తాపీ గా ఉంటోన్న అల్లుళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవ డం ఈవిభాగం పని. నమ్మక ద్రోహం తదితరాలపై బాధితులకు న్యాయం చేసేందుకు ఈవిభాగం సిద్ధం గా ఉంటుంది. వివిధ దేశాల నుంచి చేస్తోన్న ఫిర్యాదు ల్లో శాంతి భద్రతలకు సంబంధించిన వి రెండోస్థానం లో ఉన్నాయని ఏపీ ఎన్‌ఆర్‌టీ సీఈవో వేమూరి రవి తెలిపారు.