AP-CM-administration-is-nice-says-shetty

‘ఏపీ పాలన భేష్‌! మోదీ సూచనతోనే ఇక్కడికొచ్చా’

అబుదాబి ప్రభుత్వానికీ ఆసక్తి
అమరావతిలో తొలి ఎఫ్‌డీఐ నాదే
13 వేల కోట్లతో ప్రాజెక్టులకు శ్రీకారం
రెండేళ్లలోనే మెడిసిటీ ప్రారంభం
’ఆంధ్రజ్యోతి’తో బీఆర్‌ షెట్టి
అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): సుపరిపాలన చూసే ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చామని ప్రవాస భారతీయ సంపన్నుడు, అబుదాబి వ్యాపారవేత్త బీఆర్‌ షెట్టి తెలిపారు. చంద్రబాబు క్రియాశీల ముఖ్యమంత్రి అని ప్రశంసించారు. తమ సంస్థల ఏర్పాటుకు సహకరించే విషయంలో రాష్ట్ర అధికార యంత్రాంగం చురుగ్గా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగున్నర దశాబ్దాల క్రితం కర్ణాటక నుంచి అరబ్‌ నేలకు వలస వెళ్లిన బీఆర్‌ షెట్టి, అబుదాబి కేంద్రంగా సొంత వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. గత ఏడాది తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి అమరావతి సహా రాష్ట్రవ్యాప్తంగా రెండు బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 13 వేల కోట్లు) పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమరావతిలో తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) బీఆర్‌ షెట్టిదే కావడం విశేషం.
 

ఇక్కడ ఒక బిలియన్‌ డాలర్ల వ్యయంతో వైద్య విద్య, ఆసుపత్రి, పరిశోధనా సంస్థలతో కూడిన ‘అమరావతి మెడిసిటీ’ నిర్మాణాన్ని తలపెట్టారు. నవ్యాంధ్ర నూతన రాజధానిలో తన ప్రాజెక్టు శంకుస్థాపనకోసం అమరావతి వచ్చిన బీఆర్‌ షెట్టి ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అమరావతిలో మొదటి పెట్టుబడి నాదే అవుతుందని మీరు మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు. ఆచరణలో కాస్త ఆలస్యం జరిగినట్టుంది!

 

లేదు. విదేశీ పెట్టుబడిదారుల్లో నేనే మొదటివాడిని. ’బీఆర్‌ఎస్‌ అమరావతి మెడిసిటీ’ మొదటి ఎఫ్‌డీఐ ప్రాజెక్టు.

 
మీ సొంత రాష్ట్రం కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడి ప్రతిపాదనలపై చర్చలు జరిగాయి. వాటిని ప్రక్కనపెట్టి ఆంధ్రపదేశ్‌ను ఎంచుకోవడానికి కారణం?
సుపరిపాలనే నన్ను ఇంతదూరం తీసుకొచ్చింది. చంద్రబాబు క్రియాశీల ముఖ్యమంత్రి. ఇతరులు అధికారస్వాములు. నేను చంద్రబాబు అభిమానిని. ఇప్పుడు కొత్తగా కాదు... ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండగానే ఆయనతో నాకు మంచి సంబంధాలున్నాయి. నన్ను ఆయన స్వాగతించారు. మీరు ఏ ప్రాజెక్టు చేపట్టినా ప్రోత్సహి స్తామని చెప్పారు.
 
మీ పెట్టుబడుల విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమిటి?
అమరావతిలో పెట్టుబడి పెట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా నాకు చెప్పారు. మోదీ ప్రపంచంలోనే ఉత్తమ ప్రధాని. చంద్రబాబు భారతదేశంలోనే నెంబర్‌ 1 సీఎం. ఇద్దరూ పనిమంతులే. భారతదేశ అభివృద్ధి రేటు ఏడు శాతం మాత్రమే ఉంటే.. ఆంరఽధప్రదేశ్‌ వృద్ధి రేటు ఏకంగా 11 శాతం దాటింది. అందుకే ఇక్కడికి వచ్చా.
 
మెడిసిటీ ప్రాజెక్టులో భాగమయ్యే సంస్థలు, సేవలు ఏమిటి?
అమరావతి మెడిసిటీ నా ప్యాషన్‌. మంచి విద్య, వైద్య వ్యవస్థలను ఇక్కడికి తీసుకొస్తా. రాష్ట్రంలో మొత్తంగా రెండు బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 13వేల కోట్లు) పెట్టుబడి పెట్టబోతున్నా. తొలిగా రూ.6.5 వేల కోట్లతో మెడికల్‌ కాలేజీ, హెల్త్‌ కాంప్లెక్స్‌ తదితరాలతో మెడిసిటీ నిర్మిస్తా. ఇంజనీరింగ్‌, బయోమెడికల్‌ కాలేజీలూ వస్తాయి. క్వాంటమ్‌ కంప్యూటర్స్‌, ప్రివెంటివ్‌ మెడిసిన్‌ మా ప్రాజెక్టులో భాగం. నాసా సహకారం కూడా తీసుకొని.. మూడేళ్లలో ఈ సంస్థలు ప్రారంభమవుతాయి. మెడిసిటీని రెండేళ్లలో ప్రారంభిస్తాం.
 
ఏపీలో మీరు ఒప్పందాలు చేసుకున్న ఇతర ప్రాజెక్టుల పురోగతి ఎలా ఉంది? సకాలంలో పూర్తవుతాయా?
ఫార్మా యూనిట్‌ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జపాన్‌ కంపెనీ భాగస్వామి కానుంది. నాసా సహకారంతో క్వాంటమ్‌ కంప్యూటర్స్‌ ప్రాజెక్టు చేపడుతున్నాం. ఇది దేశంలోనే మొదటి అడుగు. ఇంకా ఇతర ప్రాజెక్టులు కూడా త్వరితగతిన చేపడతాం. నాదగ్గర మిగులు ధనం ఉంది. ఇలా ఎవరూ చెప్పరు. నాకు చెప్పే ధైర్యం ఉంది. నేనిక్కడికి, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో భాగం కావాలనే ఓ సానుకూల దృక్పథంతో వచ్చా. నా పెట్టుబడికి ఎల్లలు లేవు. కులం, దేశం, రాష్ట్రం సరిహద్దులు చూడను. ఆఫ్రికా, ఈజిప్టు, నేపాల్‌ వంటి దేశాల్లోనూ పెట్టుబడి పెట్టాను.నేను సంపన్నుడిని. నాకు నలుగురు బిడ్డలు. వారికి నేను డబ్బు ఇవ్వవలసిన అవసరంలేదు. నేను మదర్‌ థెరెస్సాలా ఉంటానని చెప్పనుగాని, ప్రజలకు సహాయం చేయాలనుకుంటాను.
 
ఏపీలో మీరు పెట్టుబడి పెట్టడంతోపాటు అబుదాబి ప్రభుత్వంతో, అక్కడి ఇన్వెస్టర్లతో చర్చిస్తానని చెప్పారు. ఈ విషయంలో ఏమైనా పురోగతి ఉందా?
మాట్లాడుతున్నాం. నేను చంద్రబాబు అబుదాబి రాకకోసం ఎదురు చూస్తున్నాను. ఇండియా నుంచి నేనేమీ తీసుకెళ్లలేదు. అబుదాబిలో సంపదను కూడబెట్టుకున్నాను. అందుకు అక్కడి రాజకుటుంబానికి కృతజ్ఞుడిని. వాళ్ళు నాకే కాదు, భారత్‌కు, మోదీకి కూడా ఆప్తులు. అబుదాబి క్రౌన్‌ప్రిన్స్‌ భారత్‌కు 75 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి ప్రకటించారు. ప్రధానంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పెట్టుబడికి వారు ఆసక్తితో ఉన్నారు. రోడ్లు, ఎయిర్‌పోర్టులు, తాగునీరు.... ఇలా ఏ రంగంలోనైనా పెట్టుబడులు పెట్టడానికి వారు సిద్ధం. స్థిరత్వం, క్రియాశీలత ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు వచ్చాక అబుదాబి క్రౌన్‌ప్రిన్స్‌ స్వయంగా చర్చిస్తారు.