:: Welcome to NRI - Article ::

వలసల నిషేధానికి అమెరికా సుప్రీం ఓకే

వాషింగ్టన్‌, సెప్టెంబరు 12: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఊరట లభించింది. ఆరు ముస్లిం దేశాల నుంచి అమెరికాకు వలసలను నిషేధిస్తూ ఆయన గతంలో జారీచేసిన ఉత్తర్వుల పాక్షిక అమలుకు ఆ దేశ సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అమెరికా సెటిల్మెంట్‌ ఏజెన్సీల నుంచి ఉపాధి, వసతికి హామీ పొందిన ఆయా దేశాల శరణార్థులను కూడా అమెరికాలోకి రానివ్వాలని.. శరణార్థులకు అనుమతి స్కీంలో నమోదుచేసుకున్న వారిని కూడా రానివ్వాలని 9వ అప్పీళ్ల సర్క్యూట్‌ కోర్టు ఇటీవల ఇచ్చిన రూలింగ్‌ను తోసిపుచ్చింది. ఈ రూలింగ్‌పై ట్రంప్‌ యంత్రాంగం సోమవారం సుప్రీంను ఆశ్రయించింది.
 
దీంతో జూన్‌ 26న తామిచ్చిన రూలింగ్‌కు అనుగుణంగా ఉత్తర్వును పాక్షికంగా అమలు చేసేందుకు జస్టిస్‌ ఆంథోనీ కెన్నెడీ అనుమతించారు. అప్పీళ్ల కోర్టు రూలింగ్‌ను తిరస్కరించారు. వలసదారులకు ఆ ఆరు ముస్లిం దేశాల్లో సన్నిహిత కుటుంబ సభ్యులుంటే.. వారిని అమెరికా రానివ్వాలని ఆనాడు సుప్రీం పేర్కొంది. కాగా.. ఆ దేశాల నుంచి వలసలపై నిషేధం చట్టబద్ధమో కాదో తేల్చేందుకు సుప్రీం తదుపరి విచారణ అక్టోబరు 10న జరుగుతుంది. ఇంకోవైపు.. చిన్నపిల్లలుగా అమెరికాలోకి ప్రవేశించి.. చదువుతూ ఉద్యోగం చేసేందుకు వర్క్‌ పర్మిట్లు ఇచ్చే ‘డాకా (డెఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌)’ కార్యక్రమాన్ని రద్దుచేస్తూ ట్రంప్‌ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని కాలిఫోర్నియా రాష్ట్రం సవాల్‌ చేసింది. ఇప్పటికే 15 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా పిటిషన్లు వేశాయి.