america-state-union-meet-

అమెరికా ప్రత్యేక ఆహ్వనం అందుకున్న శ్రీనివాస్ కూచిభొట్ల భార్య

వాషింగ్టన్: అమెరికాలో జాత్యాహంకార దాడిలో బలయిపోయిన తెలుగు టెకీ శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయనకు అమెరికా ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. ట్రంప్ ఆధ్వర్యంలో జరగనున్న ఓ సభలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పంపింది.  గతేడాది ఫిబ్రవరిలో అమెరికాలోని కాన్సాస్‌లో జరిగిన జాత్యాంహకార దాడిలో ప్రవాస భారతీయుడు శ్రీనివాస్ కూచిభొట్ల చనిపోయిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్ మాడసాని తీవ్రగాయాలపాలయ్యి అనంతరం కోలుకున్నారు. గతేడాది జనవరిలో ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన నెల రోజులకే .. ఫిబ్రవరి 22న ఓ అమెరికన్ జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోయాడు.  ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే ఈ ఘటన జరగడం అందరినీ కలిచివేసింది. అమెరికా వ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్ర వివాదం చెలరేగడంతో... వలసదారుల భద్రతపై ట్రంప్ స్వయంగా ఓ ప్రకటన చేయాల్సి వచ్చింది. అయితే అమెరికా భారతీయులకు, ఇతర దేశాల వారికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని తెలియజేసేందుకు శ్రీనివాస్ భార్య సునయనను జనవరి 30న ట్రంప్ అధ్యక్షతన జరిగే స్టేట్ ఆఫ్ యూనియన్ అడ్రస్‌లో పాల్గొనాల్సిందిగా కాన్సాస్ ప్రజాప్రతినిధి కెవిన్ యోడర్ ఆహ్వనించారు.