America-second-punch-on-China

చైనాపై అమెరికా రెండో పంచ్‌

ప్రత్యర్థి దేశంపై మరో రూ.13.75 లక్షల కోట్ల టారిఫ్‌లు ప్రకటించిన ట్రంప్‌ సర్కారు

వాషింగ్టన్‌/బీజింగ్‌: ప్రపంచ మార్కెట్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. టారిఫ్‌ వార్‌లో చైనాపై అమెరికా రెండో పంచ్‌ పడింది. 3,400 కోట్ల డాలర్ల (రూ.2.34 లక్షల కోట్లు) విలువైన చైనా ఉత్పత్తులపై గత శుక్రవారం నుంచి 25 శాతం దిగుమతి సుంకాన్ని అమల్లోకి తెచ్చిన ట్రంప్‌ ప్రభుత్వం.. తాజాగా మరో 20 వేల కోట్ల డాలర్ల (రూ.13.75 లక్షల కోట్లు) ఉత్పత్తులపై 10 శాతం టారిఫ్‌ విధించనున్నట్లు ప్రకటించింది. అమెరికా మొదటి దెబ్బకు చైనా తక్షణమే అదే స్థాయిలో జవాబిచ్చింది. చైనాలోకి ఏటా దిగుమతయ్యే 3,400 కోట్ల డాలర్ల విలువైన అమెరికన్‌ కార్లు, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల మోత మోగించింది. ప్రతీకార చర్యలకు పాల్పడిపడితే చైనా నుంచి దిగుమతి అవుతోన్న మరో 20 వేల కోట్ల డాలర్ల ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామని ట్రంప్‌ ముందుగానే హెచ్చరించారు. అయినా చైనా వెనక్కి తగ్గకపోగా.. దెబ్బకు దెబ్బ కొట్టింది.
 
దాంతో ట్రంప్‌ ప్రభుత్వం ముందుగా హెచ్చరించినట్లుగానే మరిన్ని చైనా ఉత్పత్తులపై సుంకాలను ప్రకటించింది. పది శాతం టారిఫ్‌ విధించనున్న చైనా వస్తువుల జాబితాను అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి రాబర్ట్‌ లైట్‌హైజర్‌ బుధవారం నాడు విడుదల చేశారు. ఆ లిస్ట్‌లో పళ్లు, కూరగాయలు, హ్యాండ్‌బ్యాగ్‌లు, రిఫ్రిజిరేటర్లు, రెయిన్‌ జాకెట్లు, బేస్‌బాల్‌ గ్లోవ్స్‌తోపాటు పలు చైనా ఉత్పత్తులున్నాయి.