America-increases-Tax-on-Indian-companies

ఆక్వా కంపెనీలకు అమెరికా ఝలక్‌

రొయ్యల దిగుమతిపై యాంటీ డంపింగ్‌ సుంకాల పెంపు..

అవంతీ ఫీడ్స్‌, వాటర్‌బేస్‌, అపెక్స్‌ ఫ్రోజెన్‌పై ప్రభావం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): భారత ఆక్వా కంపెనీలకు అమెరికా ప్రభుత్వం ఝలక్‌ ఇచ్చింది. భారత్‌ నుంచి దిగుమతి అవుతున్న రొయ్యల (ష్రింప్‌)పై యాంటీ డంపింగ్‌ సుంకాలను ఏకంగా మూడింతలు పెంచినట్లు అమెరికా ప్రకటించింది. రొయ్యల దిగుమతులపై ఇప్పటి వరకు 0.84 శాతంగా యాంటీ డంపింగ్‌ సుంకాన్ని 2.34 శాతానికి పెంచినట్లు తెలిపింది. అమెరికా యాంటీ డంపింగ్‌ సుంకాల పెంపుతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్న ఆక్వా కంపెనీలైన అవంతీ ఫీడ్స్‌, వాటర్‌బేస్‌, అపెక్స్‌ ఫ్రోజెన్‌, దేవి సీఫుడ్స్‌ సహా మరికొన్ని కంపెనీలకు గడ్డుకాలం ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ కంపెనీలు రొయ్యలు, చేపల దాణా, ష్రింప్‌ ప్రాసెసింగ్‌లో కీలకంగా ఉన్నాయి. మరోవైపు ఈ కంపెనీల ఎగుమతుల్లో అమెరికా మార్కెట్‌ వాటా దాదాపు 90 శాతంగా ఉంది. ఇందులో అవంతీ ఫీడ్స్‌, అపెక్స్‌ ఫ్రోజెన్‌, వాటర్‌బేస్‌ మార్కెట్లలో లిస్టవగా దేవి సీఫుడ్స్‌ త్వరలో పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సంధ్య మెరైన్స్‌ లిమిటెడ్‌, నెక్కంటి సీఫుడ్స్‌ కూడా పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. కాగా అమెరికాలో రొయ్యల అమ్మకాలు, దిగుమతులను పరిశీలించిన పిదప యాంటీ డంపింగ్‌ సుంకాల విధింపునకు సంబంధించి సమీక్ష నిర్వహించనున్నట్లు వాణిజ్య శాఖ తెలిపింది. యాంటీ డంపింగ్‌ సుంకాలను మదింపు చేయటానికి యుఎస్‌ కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ (సిబిపి) పలువురి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని డిఒసి తెలిపింది. సుంకాల విధింపునకు సంబంధించి దేశీయ కంపెనీలతో చర్చించిన తర్వాత అమెరికా ప్రభుత్వంతో విస్తృత స్థాయిలో చర్చలు జరపనున్నట్లు పేర్కొంది. మరోవైపు సీఫుడ్‌ ఇంపోర్ట్‌ మానిటరింగ్‌ ప్రొగ్రామ్‌ (ఎస్‌ఐఎంపి) కిందకు రొయ్యలను చేర్చాలన్న అమెరికా సెనెటర్ల ఆలోచనకు అనుగుణంగా యుఎస్‌ ప్రభు త్వం యాంటీ డంపింగ్‌ సుంకాలను పెంచినట్లు తెలుస్తోంది. అమెరికా ప్రధానంగా భారత్‌, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌, వియత్నాం దేశాల నుంచి పెద్ద ఎత్తున రొయ్యలను ఎగుమతి చేసుకుంటోంది.
 
పతనబాటలో షేర్లు..
అమెరికా నిర్ణయంతో వాటర్‌బేస్‌, అవంతి ఫీడ్స్‌, అపెక్స్‌ ఫ్రోజెన్‌ షేర్లు పతనబాట పట్టాయి. సోమ వారం వాటర్‌బేస్‌ షేరు ఇంట్రాడేలో ఏకంగా 8 శాతానికి పైగా పడిపోయి చివరలో కొద్దిగా కోలుకుని 5.62 శాతం నష్టంతో రూ.258.55 వద్ద స్థిరపడింది. అవంతీ ఫీడ్స్‌ షేరు 3.22 శాతం నష్టంతో రూ.22,81.70 వద్ద క్లోజైంది. అపెక్స్‌ ఫ్రోజెన్‌ షేరు స్వల్ప నష్టంతో రూ.653 వద్ద ముగిసింది.
 
అవంతీ ఫీడ్స్‌లో థాయ్‌ యూనియన్‌ వాటా విక్రయం
అవంతీ ఫీడ్స్‌లో థాయ్‌ యూనియన్‌ గ్రూప్‌ పబ్లిక్‌ కంపెనీ దాదాపు 10 శాతం వాటాను రూ.1,047.20 కోట్లకు విక్రయించింది. సోమవారం ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఈ వాటాలను విక్రయించింది. 9.69 శాతానికి సమానమైన 44 లక్షల షేర్లను థాయ్‌ యూనియన్‌ ఆసియా ఇన్వె్‌స్టమెంట్‌ హోల్డింగ్‌ కొనుగోలు చేసింది. ఒక్కో షేరును 2,380 రూపాయల సగటు ధరకు థాయ్‌ యూనియన్‌ గ్రూప్‌ విక్రయించింది.