america-gave-suggestions-to-its-citizens-donot-travel-in-north-telangana

ఉత్తర తెలంగాణలో పర్యటించొద్దు

అమెరికా పౌరులకు ఆ దేశం సూచన

నక్సల్‌ సమస్యే కారణం?
 
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పర్యటించవద్దని అమెరికా ప్రభుత్వం తమ దేశ పౌరులకు సలహా ఇచ్చింది. ఈ మేరకు ఒక ప్రయాణ సలహా సూచిక (ట్రావెల్‌ అడ్వైజరీ)ను విడుదల చేసింది. ఉత్తర తెలంగాణ పరిధిలోని వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో పర్యటించొద్దని ఆ దేశ పౌరులు, వివిధ సంస్థల్లో పని చేస్తున్న సిబ్బందిని కోరింది. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల్లో పర్యటించే అమెరికా పౌరులకు హైదరాబాద్‌లోని కాన్సులేట్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా సిటిజన్‌ సెంటర్‌ ఉంది. అత్యవసర సమయాల్లో ఈ సెంటర్‌ను సంప్రదిస్తే తమ పౌరులకు అక్కడి అధికారులు సాయం అందిస్తారు.
 
అయితే ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో అత్యవసర సర్వీసులను అందించే సామర్థ్యం స్థానికంగా ఉన్న కాన్సులేట్‌కు లేదని, అందువల్ల ఆ ప్రాంతాల్లో పర్యటించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సలహా సూచికలో పేర్కొం ది. ‘‘ఛత్తీస్‌గఢ్‌,మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో నక్సల్స్‌ ప్రాబల్యం బలంగా ఉంది. ఉత్తర తెలంగాణాలోని జిల్లాలు ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నా యి. కేవలం ఉత్తర తెలంగాణ జిల్లాలు మాత్రమే కాదు.. తూర్పు మహారాష్ట్రలో కూడా పర్యటించవద్దని ఈ సూచికలో పేర్కొన్నారు.’’ అని కాన్సులేట్‌ అధికారి ఒకరు వివరించారు. ఇటీవల ఉత్తర తెలంగాణలో నక్సల్స్‌ ప్రభావం తగ్గినా అమెరికా ఈ సలహా సూచికను విడుదల చేయటంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, విదేశాల్లో పర్యటించే తమ పౌరుల సౌకర్యం కోసం ప్రపంచంలోని వివిధ దేశాలను అమెరికా నాలుగు స్థాయిల్లో విభజించింది.
 
ఆయా దేశాల్లో ఉన్న శాంతి భద్రతల పరిస్థితి, వాతావరణ పరిస్థితులు, దౌత్య సంబంధాల ఆధారంగా ఈ స్థాయిలను నిర్ణయిస్తారు. స్థాయులను బట్టి యూర్‌పలోని అనేక దేశాలు లెవెల్‌-1లో, భారత్‌ వంటి దేశాలు లెవల్‌-2లో, పాక్‌ వంటి దేశాలు లెవల్‌-3లో, ఆఫ్గనిస్థాన్‌ వంటివి లెవల్‌-4లో ఉన్నాయి. లెవల్‌-2లో ఉన్నా భారత్‌లోని జమ్మూకాశ్మీర్‌కు వెళ్లవద్దని అమెరికా తమ పౌరులకు సూచించింది. ‘‘భారత అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం- లైంగిక అత్యాచారాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పర్యాటక ప్రాంతాల్లో కూడా ఇవి జరుగుతున్నాయి. అందువల్ల పర్యాటకులు చాలా జాగ్రత్తగా ఉండాలి’’అని ఈ సూచికలో పేర్కొంది.
 
ఇతర సలహాలు
మహిళలు ఒంటరిగా ఎక్కడికి వెళ్లొద్దు.
ఎక్కువ కాలం ఉండదలుచుకుంటే ఆ ప్రాంతానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి
జమ్మూకాశ్మీర్‌కు వెళ్లవద్దు. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ప్రయాణించవద్దు.- స్పెషల్‌డెస్క్‌