:: Welcome to NRI - Article ::

'ఉత్తరకొరియాతో యుద్ధానికే ట్రంప్ మొగ్గు'

వాషింగ్టన్: దక్షిణకొరియాతో కలిసి అమెరికా సంయుక్త వైమానిక విన్యాసాలు నిర్వహిస్తోంది. కొరియా ద్వీపకల్పంలో అమెరికా బి1బి విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. దాంతో ఉత్తరకొరియాపై యుద్ధానికి అమెరికా సిద్ధమైపోతోందని అంతర్జాతీయ మీడియా అంచనా వేస్తోంది. అయితే అలాంటిదేమి లేదని వైట్ హౌజ్ సిబ్బంది వ్యవహరాల ముఖ్యాధికారి జాన్ కెల్లి స్సందించారు. ఉత్తరకొరియా న్యూక్లియర్ మిస్సైల్ తయారీని అడ్డుకోవడమే అమెరికా ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఒకవేళ ఉత్తరకొరియా మళ్లీ న్యూక్లియర్ మిస్సైల్ ప్రయోగం జరిపితే తీవ్ర పరిణామాలు తప్పకపోవచ్చని ఆయన హెచ్చరించారు.

అంతవరకు అమెరికా సంయమనం పాటిస్తుందన్నారు. అలాగే దక్షిణకొరియాతో నిర్వహిస్తున్న వైమానిక విన్యాసాలు ప్రతి యేడాది నిర్వహిస్తున్నామని వాటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. పెంటగాన్ మాజీ అధికారి జిమ్ స్కాఫ్ కూడా కెల్లి వ్యాఖ్యలతో ఏకీభవించారు. ఇప్పటికే ఉత్తరకొరియాపై అన్ని రకాలుగా చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. ప్రపంచ దేశాల్లో ఒంటరిని చేశామని ఏ దేశం నుంచి కూడా సహయసహకారాలు అందకపోతే ఉత్తరకొరియా భవిష్యత్తులోనూ న్యూక్లియర్ ప్రయోగాలు జరపబోదని జిమ్ అభిప్రాయపడ్డారు. అయితే ట్రంప్ మాత్రం ఉత్తరకొరియాతో యుద్ధానికే మొగ్గు చూపుతున్నారని అంతర్జాతీయ మీడియా ఆరోపిస్తోంది.