ambhani-brothers-in-top-varity-500-people

‘వెరైటీ’ టాప్‌ 500 జాబితాలో అంబానీ సోదరులు

న్యూయార్క్‌: ప్రపంచ ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమను రూపుదిద్దడంలో అత్యంత ప్రభావవంతంగా ఉన్న 500 మంది వ్యాపార సారథులతో వెరైటీ మేగజైన్‌ రూపొందించిన జాబితాలో భారత్‌ నుంచి డజను మందికి స్థానం లభించింది. వీరిలో ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేష్‌ అంబానీ ఆయన సోదరుడు అనిల్‌ అంబానీ, బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌, బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా, రచయిత, డైరెక్టర్‌ కరణ్‌ జోహార్‌, స్టార్‌ ఇండియా సిఇఒ ఉదయ్‌ శంకర్‌, ఎస్సెల్‌ గ్రూప్‌ చైర్మన్‌ సుభాష్‌ చంద్ర, యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌కు చెందిన ఆదిత్య చోప్రా, బాలాజీ టెలీఫిల్మ్స్‌కు చెందిన ఏక్తా కపూర్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సిఇఒ పునిత్‌ గోయెంకా ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచ ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమ పరిమాణం 2 లక్షల కోట్ల డాలర్లుగా ఉందని వెరైటీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ జాబితాలో వాల్ట్‌ డిస్నీ కంపెనీ చైర్మన్‌, సిఇఒ రాబర్ట్‌ అగ్రస్థానంలో నిలిచారు. ఈ రంగంలోని పలు కంపెనీలను కొనుగోలు చేయడంలో ఈయన సిద్ధహస్తుడు.