:: Welcome to NRI - Article ::

‘అనంత’లో విమానాశ్రయం!

వచ్చే నెల నుంచి విశాఖ- జోధ్‌పూర్‌, కడప- బెజవాడ నడుమ విమానాలు

అమరావతి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనంతపురం - బెంగళూరు నడుమ దీన్ని ఏర్పాటు చేయనున్నారు. విమానాశ్రయం నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో బుధవారం మౌలిక వసతుల కల్పనపై సీఎం సమీక్ష నిర్వహించారు. కర్నూలు జిల్లా గనిలో ఏర్పాటు చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ పార్కు సహా, అనంతపురం జిల్లా ఎన్‌.పి.కుంట, తాడిపత్రి, కడప జిల్లాల్లోని గాలివీడు, మైలవరంలో నెలకొల్పుతున్న అలా్ట్ర మెగా సోలారు పార్కుల పురోగతిని అధికారులు వివరించారు.

గన్నవరం, తిరుపతి విమానాశ్రయాల్లో అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు ఎదురు చూస్తున్నామని, విశాఖ విమానాశ్రయంలో కార్గో కార్యక్రమాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. గన్నవరం, రాజమహేంద్రవరం విమానాశ్రయాల్లో రెండో రన్‌వే ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకూ 8 శాతం వృద్ధి నమోదైందని, విమానాశ్రయాలకు ప్రయాణికుల తాకిడి 16 శాతం పెరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది అక్టోబరు నుంచి నాన్‌స్టాప్‌ రీజినల్‌ కనెక్టివిటీ స్కీమ్‌ (ఆర్‌సీఎస్‌) కింద విమానాలు విశాఖ - జోధ్‌పూర్‌, కడప- విజయవాడకు తిరుగుతాయని చెప్పారు. కాకినాడ- విశాఖ నడుమ 180 కిలోమీటర్ల గ్యాస్‌ పైపులైన్‌ ఏర్పాటు ప్రక్రియ టెండర్ల దశలో ఉందని వివరించారు.