300-unpaid-catering-workers-in-UAE-seek-help-to-go-home

భారత కార్మికులకు నరకం చూపిస్తున్న దుబాయ్ కంపెనీ..

అబుదాబి: దాదాపు మూడు వందల మంది కార్మికులు అయిదు నెలలకు పైగా జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో భారత కార్మికులే అధికంగా ఉన్నారు. ఓ క్యాటరింగ్ కంపెనీ వివిధ వృత్తుల్లో వారిని నియమించుకుంది. ముస్తాఫా ఇండస్ట్రీయల్ ప్రాంతంలో ఓ బిల్డింగ్‌లో వారి కోసం తాత్కలిక విడిది ఏర్పాటు చేసింది. అయితే బుధవారం నుంచి వారు నివసిస్తున్న బిల్డింగ్‌కు కరెంట్, నీళ్ల సరఫరా ఆపేశారని కార్మికులు వాపోతున్నారు. అసలు తమ బాధలు ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కంపెనీ ప్రతినిధులు తమతో పనులు చేయించుకుంటారని వారన్నారు. కొన్ని సందర్భాల్లో తిండి కూడా పెట్టడం లేదన్నారు. వారి దయనీయ పరిస్థితి గురించి సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి స్పందించారు. మానవవనరుల శాఖ అధికారులతో నవదీప్ మాట్లాడారు. మానవవనరుల శాఖ అధికారులు త్వరలోనే కార్మికుల వద్దకు తమ ప్రతినిధిని పంపించి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని చర్యలు తీసుకుంటామన్నారని నవదీప్ తెలిపారు. ఇదిలావుండగా కంపెనీ యజమానులు ప్రస్తుతం విదేశాలకు విహరయాత్ర కోసం వెళ్లారని అందువల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.