22-people-found-hiding-inside-concrete-mixer-in-UAE

సిమెంట్ మిక్సింగ్ ట్యాంకర్‌ను స్కాన్ చేసిన పోలీసులకు షాక్

షార్జా: సిమెంట్ మిక్సింగ్ ట్యాంకర్‌ను ఎక్స్‌రే స్కానర్‌తో స్కాన్ చేసిన పోలీసు అధికారులు కంగుతిన్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ట్యాంకర్‌లో ఏకంగా 22 మంది ఉన్నారు. ట్యాంకర్‌లోని డ్రైవర్‌‌తోసహా 22 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారని, ఓ ట్యాంకర్ ద్వారా  కొందరిని సరిహద్దు దాటించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని యూఏఈ ఫెడరల్ కస్టమ్స్ అథారిటీ(ఎఫ్‌సీఏ), డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ సీపోర్ట్ అండ్ కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. అప్రమత్తమైన అధికారులు సరిహద్దులో కాపుకాశారు. ముందుగా సమాచారం ఉండడంతో ఓ సిమెంట్ మిక్సింగ్ ట్యాంకర్‌ను ఎక్స్‌రే స్కానర్‌తో స్కాన్ చేయగా అసలు విషయం తెలిసింది. నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నామని, కఠినంగా శిక్షించనున్నామని అధికారులు వెల్లడించారు. దేశంలోకి అక్రమంగా చొరబడాలని ప్రయత్నించేవారిని ఏమాత్రం క్షమించబోమని, వదలబోమని అధికారులు స్పష్టం చేశారు.