14-worms-pulled-from-womans-eye-after-rare-infection

మనిషి కంట్లో పురుగులు..మొదటి మనిషి గుర్తింపు..

న్యూయార్క్: ఇదివరకెప్పుడూ వినని, ఒళ్లు గగుర్పొడిచే ఓ విషయాన్ని వైద్యులు వెల్లడించారు. 26 ఏళ్ల వయసున్న ఓ అమెరికన్ మహిళ కంటి నుంచి 14 పురుగులను వెతికి బయటకు తీశారు. తెలజియా గులోసా అనే ఈ పురుగులు కంటి గుడ్డుపై ఉన్నాయి. కన్ను దురదగా ఉండడంతో చేతితో నసిమిని యువతి ఓ రోజు ఒక పురుగుని గుర్తించింది. చేతితో తొలగించింది. అనంతరం వైద్యులను సంప్రదించింది. పరీక్షించిన వైద్యులు ఆమె ఎడమ కంటిలోని మొత్తం 14 పురుగులను వెలికి తీశారు. మరికొన్ని పురుగులను యువతే స్వయంగా తీసింది. ఈ సమస్య నుంచి యువతి కోలుకుందని, 2016లో ఈ ఘటన జరిగిందని వైద్యులు వెల్లడించారు. 

తెలజియా గులోసా అనే ఈ పురుగు సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడు ఈగల ద్వారా గాలిలొ వ్యాప్తి చెందుతాయి. సాధారణంగా  కళ్ల నుంచి కారే ద్రవాన్ని ఈ పురుగులు ఆహారంగా తీసుకుంటాయి. ఓరేగాన్‌లోని సముద్ర తీరంలో ఉన్న ఓ ప్రాంతంలోని  గుర్రపు స్వారీ కేంద్రంలో పనిచేసిన యువతికి ఈ పురుగులు వ్యాపించాయి. తెలజియా గులోసా వ్యాపించిన మొదటి మనిషిగా యువతిని గుర్తించామని వైద్యులు వెల్లడించారు.

కుక్కలు, పిల్లులతోపాటు పలు జంతువుల కళ్లలో తెలజియా గులోసా ఉండడం సర్వసాధారణమని, అయితే మొదటిసారిగా ఓ మనిషి కళ్లలో గుర్తించామని తెలిపారు. అపారదర్శకంగా ఉండే ఈ పురుగులు అర అంగుళం పొడవు ఉంటాయని చెప్పారు. తెలజియాకు చెందిన ఇతర రెండు రకాల పురుగులు మనుషుల కళ్లలో ఇదివరకు గుర్తించామని, తెలజియా గులోసాను గుర్తించడం ఇదే మొదటిసారని సెంటర్స్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌కు చెందిన రిచర్డ్ బ్రాడ్బురీ తెలిపారు. ‘ ట్రాపికల్ మెడిసిన్ అండ్ హైజీన్’ అనే అమెరికా జర్నల్‌లో ఈ విషయాన్ని ఆయన ప్రచురించారు. ఈ పురుగులు దీర్ఘకాలంపాటు కంటిలోనే ఉంటే ప్రమాదకరమని, క్రమంగా చూపును కోల్పోయేందుకు దారితీస్తాయని జర్నల్‌లో పేర్కొన్నారు. ఉత్తర అమెరికా రాష్ట్రాలతోపాటు కెనడాలోని జంతువుల్లో తెలజియా గులోసా కనిపిస్తుందని వివరించారు.