:: Welcome to NRI - Article ::

‘అమెరికా గొప్పతనాన్ని దిగజారుస్తున్న ట్రంప్’

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మొదటిసారి గట్టి షాక్ తగిలింది. ఏసియన్-అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్‌ సంబంధాలపై నియమించిన సలహాదారుల కమీషన్‌లోని 10 మంది సభ్యులు రాజీనామా చేశారు. ట్రంప్ అవలంభిస్తున్న విధానాలు, ఇమ్మిగ్రేషన్‌పై నిబంధనలు, ఏడు ముస్లిం దేశాలపై నిషేదం వంటి చర్యలపై ప్రజల నుంచి తీవ్రవ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయని, ఈ నేపథ్యంలో కమీషన్‌కు గుడ్‌బై చెప్పామని సభ్యులు తెలిపారు. ఈ కమీషన్‌లోని సభ్యులను ఒబామా ప్రభుత్వ హయంలో నియమించడం గమనార్హం.

 
దీంతో ట్రంప్‌పై వ్యతిరేకతతో రాజీనామాలు చేస్తున్న వ్యక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఇటీవలే కొందరు వైట్‌హౌస్ అధికారులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ సలహారుల సంఘంలోని 10 మంది సభ్యులు రాజీనామా చేయడం చర్చలకు దారితీస్తోంది. దూకుడుగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ పదవి చేపట్టి నెల రోజులు కూడా గడవక ముందే  అమెరికా గొప్పతనాన్ని మసకబారుస్తున్నారని  ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయనను విమర్శిస్తున్నారు.