10-expats-win-1-million-dollars-raffle

10 మంది వలసజీవుల ప్రయత్నం ఫలించింది..లాటరీ దక్కింది

దుబాయ్: ఎన్నో ఆశలు, లక్ష్యాలతో బాధను దిగమింగుకొని.. కుటుంబ సభ్యులకు దూరంగా.. వేరు వేరు దేశాల నుంచి గల్ఫ్ దేశం యూఏఈ వెళ్లిన 10 మంది వలసజీవులను అదృష్టం వరించింది. వలస వచ్చిన వారంతా దుబాయ్‌లో మంచి స్నేహితులుగా మారారు. వారంతా కలసి తీసుకున్న సమిష్టి నిర్ణయం వారిని అదృష్టవంతులుగా మార్చింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలీనీర్ అండ్ ఫైనెస్ట్ సర్పైజ్ డ్రాలో లక్కీ విజేతలుగా నిలిపింది. భారత్, బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్‌కు చెందిన పది మంది వలసజీవులు తాము సంపాదించిన కొద్ది మొత్తంలో లాటరీ టికెట్ కొనుగోలు కోసం దాచిపెట్టారు. ఈ డబ్బుతో భారత్‌కు చెందిన గుర్మీత్ సింగ్(38) లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. మంగళవారం డ్రా తీయడంతో గుర్మీత్ కొనుగోలు చేసిన టికెట్‌కు లాటరీ దక్కింది. దీంతో 10 మంది వలసజీవులకు 1 మిలియన్ డాలర్లు దక్కాయి. భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 7 కోట్లకు పైగా డబ్బును పది మంది సమానంగా పంచుకోనున్నారు. దీంతో ఆ వలసజీవుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే కొంతకాలంగా ఒంటరిగానే లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసిన గుర్మీత్ ఈసారి తన స్నేహితుల కలిసి చేసిన ప్రయత్నం సఫలమైందని తెలిపాడు.